17 March, 2026 | 5:01 AM

317 జీవో బాధితుల సమస్యలు పరిష్కరించండి

17-03-2026 12:00 AM

తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాల్లో 317 జీవో సృష్టించిన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను చేపట్టిన సమయంలో ఈ వివాదాస్పద జీవోను తీసుకువచ్చింది. పరిపాలన సౌలభ్యం పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియ చివరకు వేలాది మందిని తమ సొంత జిల్లాల నుంచి వందల కిలోమీటర్ల దూరానికి తరిమేసింది.

స్థానికతను ప్రాతిపదికగా తీసుకోకుండా కేవలం సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు జరపడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు తమ ప్రాంతంలోనే స్థానికేతరులుగా మారిపోయారు. కన్నవారిని, కుటుంబాలను, కట్టుకున్న వారిని వదిలి గుర్తు తెలియని ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల వారి సామాజిక, వ్యక్తిగత జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించగా బాధితులను తిరిగి వారి సొంత జిల్లాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు కూడా చేసింది.

గత ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ 317 జీవో బాధితులకు జరిగిన అన్యాయాన్ని తమ మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రజల సాక్షిగా హామీ ఇచ్చింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ‘ప్రజా ప్రభుత్వం’గా ప్రకటించుకోవడంతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జీవో 190 జారీ చేసి బాధితుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. సుమారు 6,500 మంది తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన వివిధ శాఖల అధికారులు సుమారు 3,500 మందికి నిజంగానే అన్యాయం జరిగిందని తేల్చారు. అయితే కమిటీ నివేదిక ఇచ్చి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం బాధితులను ఆందోళనకు గురిచేస్తోంది.

బాధితుల్లో కేవలం సాధారణ ఉద్యోగులే కాకుండా వికలాంగులు, చిన్న పిల్లల తల్లులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. మానవీయ కోణంలో వీరికి తక్షణమే ఊరటనివ్వాల్సి ఉండగా జాప్యం జరుగుతుండటం గమనారం. ప్రతిరోజూ 300 నుంచి 400 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ విధులు నిర్వహించడం వల్ల వీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

సుదీర్ఘ ప్రయాణాల వల్ల నిద్రలేమి, వెన్నునొప్పి వంటి సమస్యలతో పాటు వృత్తిపరమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది వారి బోధన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. భాషోపాధ్యాయుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలను బోధించే వీరు గత మూడు దశాబ్దాలుగా పదోన్నతులు లేక ఒకే గ్రేడ్‌దీతిజిజిలో మగ్గిపోయారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల వేతనం తీసుకుంటూనే ఉన్నత పాఠశాలల్లో అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవల వీరికి పదోన్నతులు లభించాయి. అయితే ఇదే సమయంలో పదోన్నతులు వచ్చాయన్న నెపంతో 317 జీవో కింద వారు చేసుకున్న బదిలీ దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. పదోన్నతి అనేది వారి సర్వీసులో భాగంగా వచ్చే హక్కు అని, దానిని 317 జీవో సమస్యతో ముడిపెట్టడం సరికాదని వారు వాదిస్తున్నారు. 

             డాక్టర్ ఎస్.విజయ భాస్కర్, వ్యాసకర్త: 9290826988