17 March, 2026 | 1:23 AM

చమురు యుద్ధమా!

17-03-2026 12:05 AM

ఇరాన్‌లో అధికార మార్పిడి జరగాలని, ఆ దేశ ప్రజలకు విముక్తి లభించాలనేది తన అభిమతమని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ గతంలో ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించిన తర్వాత యుద్ధం ముగుస్తుందని అంతా భావించారు. తర్వాత ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. తర్వాత కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా సైతం అధికార పగ్గాలు చేపట్టారు. అయినా, ట్రంప్ వైఖరిలో శాంతించినట్లు కనిపించడం లేదు.

తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే ట్రంప్ చెప్పేదొక్కటి, చేసేదొక్కటి అన్నది స్పష్టమవుతున్నది. ట్రంప్ కన్ను ఇరాన్ ఆధీనంలో ఉన్న చమురు వనరులపై పడింది. ఇరాన్ వద్ద ఉన్న అపారమైన చమురు శక్తిని తన హస్తగతం చేసుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను పడింది. ‘ఖర్గ్ ద్వీపంలో గ్రౌండ్ ఆపరేషన్కు సంబంధించి అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

హోర్ముజ్ జలసంధి తెరిచే ప్రయత్నాలు నిలిచిపోతే మాత్రం.. ఆ ఆలోచన మారొచ్చు’ అని ఇటీవల పెంటగాన్ ప్రతినిధి అధికారి ఒకరు పేర్కొనడం, వెనుక ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఖర్గ్ కేవలం ఇరాన్ పరిధిలోని చిన్న భూభాగం కాదు. అది ఆ దేశ ఆర్థిక కిరీటంలోని వజ్రం లాంటిది. పర్షియన్ గల్ఫ్ తీరం నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ద్వీపం. ఇరాన్ విదేశాలకు ఎగుమతి చేసే చమురులో దాదాపు 90 శాతం వాటా ఈ ద్వీపానిదే.

అమెరికా కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, 2024లో ఈ ద్వీపం ద్వారా ఇరాన్ 78 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇక్కడి టర్మినళ్లలో రోజుకు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు లోడ్ అవుతుంది. వెనుజులాలో మాదిరిగానే ఇక్కడి వనరులపై పెత్తనం చేయాలన్న ట్రంప్ ఆశలు ఇప్పుడు ఖర్గ్ ద్వీపం వైపు మళ్లాయి. ఈ ఆర్థిక మూలాన్ని దెబ్బతీస్తేనే ఇరాన్‌కు లొంగదీసుకోగలమనేది ట్రంప్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తున్నది.

మొదటి దశలో ద్వీపంలోని రాడార్లు, రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలను దాడులతో ధ్వంసం చేయాలని, రెండో దశలో ఇక్కడి వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌ను అమెరికా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలని, ఇక మూడో దశలో సీ130 హెర్క్యులెస్ విమానాలు, చినూక్ హెలికాప్టర్ల ద్వారా భూతల దళాలను యుద్ధ క్షేత్రానికి తరలించి ద్వీపాన్ని హస్తగతం చేసుకునే వ్యూహం కనిపిస్తున్నది. సముద్ర మార్గం నుంచి యుద్ధ నౌకల సాయంతో చమురు క్షేత్రాలను, మౌలిక సదుపాయాలను చేజిక్కించుకోవాలనేది అగ్రరాజ్యం ఆకాంక్ష.

ఈ పెద్ద ఆపరేషన్ విజయవంతమైతే ఇరాన్ ఆర్థిక శక్తి అమెరికా చేతిలోకి వెళ్తుంది. ఖర్గ్ నియంత్రణ సాధించిన వారే, యుద్ధ స్వరూపాన్నే మార్చగలరని అమెరికా ప్రభుత్వ పెద్దలు భావిస్త్తున్నారు. అయితే, ఈ చమురు యుద్ధం అంతర్జాతీయంగా పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఒక బ్యారెల్ చమురు ధర 115 డాలర్లు పలుకుతున్నది.

ఖర్గ్ ద్వీపంపై దాడులు జరిగితే ఈ ధరలు మరింత పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోతుంది. ఇరాన్ ప్రతీకారంగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలను, రిఫైనర్లను లక్ష్యంగా చేసుకునే ఆస్కారం ఉంది. అదే జరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.