16 March, 2026 | 1:54 AM

తమిళ సాహిత్యపు సొత్తు ‘వైరముత్తు’

16-03-2026 12:12 AM

‘చిన్న చిన్న ఆసై.. సిరగడిక్కుం ఆసై’ (చిన్ని చిన్ని ఆశ.. చిన్నదాని ఆశ: చిత్రం-- రోజా), ‘నిన్నుక్కోరి వర్ణం.. వర్ణం.. ఉన్నై కాణ ఏంగుం.. కణ్ణం..’ (నిన్నకోరి వర్ణం.. వర్ణం. సరిసరి కలిసే నీ నయనం.. నయనం: చిత్రం. ఘర్షణ), నరుముగైయే నరుముగైయే.. పడ్రిరుక్కుం పానిత్తుళియే’ (శశి వదనే.. శశి వదనే స్వర నీలాంబరి నీవా: చిత్రం ఇద్దరు).. వంటి ఎన్నో వైరముత్తు పాటలు దక్షిణ భారతంలో ఫేమస్.

భాషా భేదం లేకుండా, సంగీత, సాహిత్య ప్రియులకంతా ఆయన పాటలు సుపరిచతమే. తమిళ దగ్గజ సాహిత్యకారులైన సుబ్రహ్మణ్యభారతి, జయకాంతన్, అఖిలన్, కన్నదాసన్.. తర్వాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన సాహిత్యకారుడు, గేయ రచయిత వైరముత్తు. తమిళ సినీ పాటల చరిత్రలో ఆయనదొక సువర్ణ అధ్యాయం. భావ కవిత్వపు లోతుల్ని సామాన్యుడికి అర్థమయ్యేలా, పల్లెటూరి మట్టి వాసనను వెండితెరపై పరిమళించేలా చేయడంలో ఆయన సిద్ధహస్తుడు.

తమిళ సినీ రంగంలో అద్భుతమైన గేయరచయితగా పేరున్న కన్నదాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, దానికి ఆధునికతను అద్ది, మూడు దశాబ్దాలకు పైగా తమిళ సినీ సాహిత్య సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడం ఒక్క వైరముత్తుకే చెల్లింది. ఆ అక్షర ప్రయాణమే ఆయనకు  భారత దేశ అత్యున్నతమైన సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డు వరకు చేర్చింది. 

మట్టి నుంచి పుట్టిన కవి

వైరముత్తు ప్రయాణం తమిళనాడులోని తేని జిల్లా మేట్టూరు అనే ఒక మారుమూల గ్రామంలో ప్రారంభమైంది. 1953 జూలై 13న రామస్వామి, పొన్మణి దం పతులకు ఆయన జన్మించారు. వారిది వ్యవసాయ నేప థ్యం కుటుంబం. అందుకే వైరముత్తుకు మట్టి పట్ల మమకారం, శ్రమ పట్ల గౌరవం ఉన్నాయి.

చెన్నులోని పచ్చయ్య ప్ప కళాశాలలో విద్యనభ్యసిస్తున్న కాలంలో ఆయనకు తమిళ సాహిత్యం పరిచయమైంది.  19 ఏళ్ల ప్రాయంలోనే ఆయన ‘వైకరై మేఘంగళ్’ (వేకువజాము మేఘాలు) పేరిట కవితా సంకలనం వెలువరించారు. ఈ సంకలనం ఎంతటి సంచలనం సృష్టించిందంటే, ఆ కవితలు అప్పట్లోనే కొన్ని తరగతుల తమిళ భాష పుస్తకాల్లో పాఠ్యాం శాలుగా ఉండేవి. 

సినీ రంగ ప్రవేశం.. నవశకానికి బాట

వైరముత్తు వృత్తిగత జీవితం తమిళనాడు ప్రభుత్వ అధికారిక భాషా కమిషన్‌లో అనువాదకుడిగా మొదలైంది. ఈ క్రమంలో ఆయనకు ఎంతోమంది సినీ ప్రముఖులు, దర్శకులతో పరిచయం ఏర్పడింది. సినీ ప్రపంచం ఆహ్వానిం చింది. 1980లో దర్శక దిగ్గజం భారతీరాజా తెరకెక్కించిన ‘నిళల్గళ్’ చిత్రంతో గేయ రచయితగా ఆయన ప్రయాణం మొదలైంది. తొలి చిత్రంలోనే ఆయన పాటలు తమిళ సాంస్కృతిక వైభవాన్ని చాటాయి.

అప్పటి మొదలు ఆయన సుమారు 7,500కి పైగా పాటలు రాశారు. ఏడు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఏకంగా ఏడు జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న భారతీయుడిగా ఆయనపై ఒక రికార్డు కూడా ఉంది. వైరముత్తు కేవలం పాటలకు పరిమితం కాకుండా, 40 పుస్తకాలు రాశారు. తద్వారా ఆధునిక తమిళ సాహిత్య రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు.

దిగ్దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, గేయ రచయిత వైరముత్తు.. ఈ ముగ్గురి కలయిక దక్షిణ భారత సినీ సంగీతంలో ఒక విప్లవం. మణిరత్నం దృశ్యానికి వైరముత్తు అక్షరం తోడైతే అది ఒక కావ్యంలా ఉంటుందనేది వారి అభిమానులు చెప్పే మాట. వైరముత్తు సతీమణి పొన్మణి విద్యావేత్త. ఆయన ఇద్దరు కుమారులు మదన్ కార్కి, కబిలన్ కూడా ప్రసిద్ధ గేయ రచయితలు. వారు సాహిత్యవేత్తలుగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

వైరముత్తుకు తమిళనాడు ప్రజలు పెట్టుకున్న ముద్దు పేరు ‘కవి పేరరసు’. అదే క్రమంగా బిరుదుగా మిగిలిపోయింది. ఆ బిరుదుకు తెలుగులో అర్థం ‘కవి చక్రవర్తి’ అని. ఆయన రచనల్లో ప్రసిద్ధమైనది ‘కల్లికట్టు ఇతిహాసం’ (కలికట్టు పురాణం) అనే నవల. తమిళ సాహిత్య చరిత్రలోనే ఆ నవల ఒక మైలురాయి. నీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం వల్ల  నిర్వాసితులైన రైతుల వ్యధను వర్ణించే ఈ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.

గ్రామీణ జీవితాన్ని, అక్కడి ప్రజల కన్నీటిని ఆయన అక్షరీకరించిన తీరు అనన్య సామాన్యం. భాషా పరిమితులను దాటి ఆయన రచనలు ప్రపంచ పాఠకుల హృదయాలకు చేరువయ్యాయి. జ్ఞానపీఠ్ పురస్కారాన్ని తమిళనాడుకు అందించిన మూడో సాహితీకారుడు వైరముత్తు. 1975లో అఖిలన్, 2002లో జయకాంతన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తమిళ సాహితీకారుడు వైరముత్తుకు ఈ పురస్కారం దక్కింది. ఆయన సాహితీ ప్రయాణం మరిన్ని శిఖరాగ్రాలు చేరాలని ఆశిద్దాం.

 రతన్ రుద్ర