నీట మునిగిన వరి పొలాలను సందర్శించిన పరిశోధన శాస్త్రవేత్తలు
- రైతులకు పంట సంరక్షణపై కీలక సూచనలు
బోధన్,(విజయ క్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలను ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం శనివారం పరిశీలించింది. కోటగిరి మండలంలోని సైలంపూర్ గ్రామం, పోతంగల్ మండలంలోని తీర్మాల్లాపూర్ గ్రామాల పరిధిలోని వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి పంట పరిస్థితిని అంచనా వేసింది. పొలాల్లో నిల్వ ఉన్న నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలని శాస్త్రవేత్తలు సూచించారు. పూర్తిగా కుళ్లిపోయిన వరి మొక్కలను గుర్తించి, అవసరమైతే మళ్లీ నాటుకోవాలని తెలిపారు.
వరి ఆకులు పసుపు రంగులోకి మారినట్లు గమనిస్తే 2 శాతం యూరియా ద్రావణం లేదా 19:19:19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. కాండం తొలిచే పురుగు నివారణకు నాట్లు వేసిన 25 రోజుల తరువాత ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ వేయాలని, అలాగే ప్రతి ఎకరాకు 5 నుంచి 6 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి పురుగుల ఉనికిని నిరంతరం గమనించాలని తెలిపారు. పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 60 మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్‌ను పిచికారీ చేయాలని సూచించారు.
బ్యాక్టీరియా ఎండాకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే యూరియా వినియోగాన్ని నిలిపివేయాలని, వ్యాధి సోకిన మడి నుంచి కింది పొలాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఎకరాకు 80 గ్రాముల ప్లాంటమైసిన్‌తో పాటు 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను పిచికారీ చేయాలని సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో శాస్త్రవేత్తలు సమతా పరమేశ్వరి, ఎం. సాయి చరణ్, బి. మంజు భార్గవి, రమ్య రాథోడ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) గౌస్, రైతులు గంగారాం, విట్టల్, వీరబాబు, ఇస్మాయిల్, బీర్కూర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.






