1 August, 2026 | 8:16 PM

తల్లిపాలు శిశువుకు తల్లి ఇచ్చే తొలి అమూల్యమైన కానుక

01-08-2026 07:12 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): తల్లి తన బిడ్డకు ఇవ్వగల మొట్టమొదటి కానుక పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడమేనని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహించనున్న “ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు” పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం “సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు – ఫలితాలను ఇచ్చే చర్యలను మరింత బలోపేతం చేయడం” అనే అంశంతో వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని చెప్పారు. అలాగే వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలని ఆదేశించారు. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం, మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలనే ఇవ్వడం, తదుపరి సమయానుకూలంగా పోషకాహారం అందించడం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు.