24 August, 2026 | 7:04 PM

పాలిటెక్నిక్ విద్యార్థుల సంతకాల సేకరణ

24-08-2026 05:26 PM

 జీవో 97 రద్దు చేయాలి

శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

కొత్తగూడెం ఆగస్టు 24 విజయ క్రాంతి: పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలని,ఏఐఎస్ఎఫ్‌ జిల్లా సమితి డిమాండ్‌ చేసింది. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రుద్రంపూర్ పాలిటెక్నిక్ కళాశాలలను యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అనుసంధానం చేయవద్దని కోరుతూ, జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్‌  జిల్లా కార్యదర్శి వరక అజిత్‌ మాట్లాడుతూ,పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, దానికి భిన్నంగా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. జీవో నెంబర్‌ 97ను రద్దు చేసి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు.

పాలిటెక్నిక్ కళాశాలలను యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో, అనుసంధానం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు నష్టం కలిగించే శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలని కోరారు. సాంకేతిక విద్యలో  మెరుగైన అవకాశాలు కల్పించే ల చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అజిత్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్‌, జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, ఉపాధ్యక్షులు సంజయ్, నాయకురాలు బండి ప్రియాన్సి,సలిగంటి జైదీప్, మానస,తదితరులు పాల్గొన్నారు.