ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను,త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజినీరింగ్ అధికారులతో కళాశాలల్లో కొనసాగుతున్న పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు రూ.3.31 కోట్ల వ్యయంతో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపడుతున్న విద్యుదీకరణ, మరుగుదొడ్ల మరమ్మత్తులు, నూతన తరగతులు గదుల నిర్మాణం, భవనాల మరమ్మత్తులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిని కళాశాలల వారీగా సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కళాశాలల్లో అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరమ్మత్తు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కళాశాలో విద్యార్థుల చేరికలు, ఇంటర్మీడియట్ ఫలితాలు, ఉత్తీర్ణత శాతంపై ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు.
ఉత్తీర్ణత శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, అవకాశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ శ్రీనివాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






