అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి
చుంచుపల్లి/భద్రాద్రి కొత్తగూడెం మే 27 (విజయక్రాంతి): అకాల వర్షానికి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం చుంచుపల్లి మండలం పెనగడప ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, రవాణా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రంలో సుమారు 1200 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నాయని, వాటిని సుజాతనగర్లోని రైస్ మిల్కు రెండు రోజులలోపు తరలింపు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని అధికారులు కలెక్టర్కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేసి పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షపు నీరు ధాన్యం నిల్వల వద్ద చేరకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంటడి సి ఓ ప్రేమ్ కుమార్, డి ఎం సతీష్, చుంచుపల్లి తాసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో సుభాషిని, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.






