calender_icon.png 14 February, 2026 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శులకు ఊరట

14-02-2026 12:04:54 AM

మంత్రి సీతక్క చొరవతో అంతర్ జిల్లా డిప్యూటేషన్‌కు అనుమతులు

223 మంది కార్యదర్శులకు ఉపశమనం

ప్రభుత్వానికి, మంత్రికి పంచాయతీ కార్యదర్శుల ధన్యవాదాలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వెనుక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక పాత్ర పోషించారు.

జీవో 317 వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీరియస్‌గా తీసుకున్న మంత్రి సీతక్క, పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేశారు. జీవో 317 వల్ల జరిగిన నష్టాలను సరిదిద్దేందుకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం జీవో 190 జారీ చేసింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా అంతర్ జిల్లా డిప్యూటేషన్ ప్రక్రియ ను ప్రారంభించిన తొలి శాఖగా పంచాయతీ రాజ్ శాఖ నిలవడం మంత్రి సీతక్క కృషికి నిదర్శనం. ఖాళీలున్న ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా డిప్యూటేషన్లకు అనుమతులిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పందిస్తూ... గ్రామ స్థాయిలో పరిపాలన బలోపేతం చేయడం, సిబ్బందికి న్యాయం చేయడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఉద్యోగులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దుతూ, పారదర్శకంగా, న్యాయబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో పంచాయతీ కార్యదర్శులకు గణనీయమైన ఉపశమనం లభించడంతో పాటు, గ్రామీణాభివద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలుకానున్నాయి. ఈ నిర్ణయంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ సమస్యలను సానుకూలంగా పరిగణించి వేగంగా పరిష్కరించిన తెలంగాణ ప్రభుత్వం, మంత్రి సీతక్కకు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.