వలస కార్మికులకు ఊరట
- 5 కేజీల గ్యాస్ సరఫరా రెట్టింపు
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఐదు కేజీల ఎఫ్‌టీఎల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కేంద్రం పెంచిన కోటాను రాష్ట్రాలు వలస కార్మికులకు పంపిణీ చేయాలని సూచించించింది. ఈ మేరకు వలస కార్మికులకు ఊరట కలిగించేలా గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఓఎంసీల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలన్నారు.
కేంద్రం పెంచిన కోటాను వలస కార్మికుల కోసం కేటాయించాలన్నారు. 5 కేజీల సిలిండర్ల అమ్మకానికి సంబంధించిన నిబంధనలను కూడా కేంద్రం సరళీకరించింది. ఎలాంటి చిరునామా, రుజువు లేకుండా, సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకుండా సిలిండర్‌ను కొనుగోలు చేయొచ్చు. 5 కేజీల సిలిండర్ ను ఇకపై ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను చూపి కూడా పొందేలా వెసులుబాటు కల్పించింది.




