కేసముద్రం మార్కెట్‌కు ఊరట!
మార్క్ ఫెడ్ ద్వారా రూ. 29,93 లక్షల ఆదాయం
కేసముద్రం, ఆగస్టు 21 (విజయక్రాంతి): రబీ సీజన్ లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో నిలువ చేసిన మక్కజొన్నల ద్వారా మార్కెట్ కు 29 లక్షల 93 వేల అదనపు ఆదాయం సమకూరుతోంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రబీ సీజన్ లో రైతులు పండించిన మక్కలకు ప్రైవేటు ట్రేడర్లు ఆశించిన ధర పెట్టకపోవడం క్వింటాలుకు గరిష్ఠంగా 1,900 రూపాయల ధర పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి తలెత్తడంతో ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా మక్కల కొనుగోళ్లు చేపట్టింది.
క్వింటాలుకు 2,400 చొప్పున 50 కిలోల భర్తీ తో 4,63,884 బస్తాల మక్కలను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మక్కల కొనుగోలు విపరీతంగా పెరిగిపోవడం, నిలువ చేయడానికి గోదాములు లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన మక్కల్లో 1,85,250 బస్తాలను ఇతర ప్రాంతాలకు తరలించి గోదాముల్లో నిలువ చేశారు. అక్కడ కూడా గోదాములు మక్కలతో నిండిపోవడంతో చివరకు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఖాళీగా ఉన్న ఫుల్ కవర్ షెడ్లు, గోదాముల్లో 2,78,684 బస్తాల మక్కలను నిలువ చేశారు.
ఇందుకోసం జిల్లా యంత్రాంగం, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు, కార్మిక సంఘాలు పూర్తిగా సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కొనుగోలు చేసిన మక్కలను కేసముద్రం మార్కెట్ యార్డుకు తరలించారు. లక్షల బస్తాల మక్కలను నిలువ చేయడానికి ప్రత్యేకంగా బీహార్ నుండి కూలీలను రప్పించారు. దాదాపు రెండు నెలల వరకు అనేక కష్టనష్టాలకోర్చి మక్కల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ విధంగా కొనుగోలు చేసి కేసముద్రం మార్కెట్ యార్డులో నిల్వచేసిన 2,78,684 బస్తాల మక్కలను విక్రయించడానికి ఇటీవల మార్క్ఫెడ్ టెండర్లు పిలువగా 2,200 చొప్పున క్వింటాలకు తీసుకునేందుకు ఓ గుత్తేదారు టెండర్ దక్కించుకున్నాడు. గత పది రోజుల నుండి గుత్తేదారు కేసముద్రం మార్కెట్లో నిల్వచేసిన మక్కలను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నాడు. దీనితో 2,200 ధర చొప్పున మార్కెట్ కు ఒక శాతం పన్ను రూపంలో 2,78,684 బస్తాల మక్కజొన్నలకు 29,93,000 రూపాయలను చెల్లిస్తున్నాడు.
ఇప్పటికే ఒక దఫా 6,65,000 రూపాయలు చెల్లించగా, మరో దఫా 11,00,000 చెల్లించారని మార్కెట్ ఇంచార్జ్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. సుమారు రెండు నెలలపాటు మార్కెట్ లో మక్కల కొనుగోళ్ల వ్యవహారం వల్ల ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఆటంకం కలగగా, మార్కెట్ ఆదాయం తగ్గిపోగా, గుడ్డిలో మెల్లగా మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా సుమారు 30 లక్షల ఆదాయం సమకూరడంతో మార్కెట్ ఆదాయానికి కొంత ఊరటగా మారింది.






