17 April, 2026 | 8:19 PM

రెండవ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

17-04-2026 07:00 PM

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి 

మోతె,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా విడుదల చేసి 20 రోజుల్లోగా రెండవ విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ 24 రోజులు అవుతున్న రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయలేదని ప్రభుత్వం తక్షణమే రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మోతే మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసి, ఖరీఫ్ సీజన్ కూడా సమీపిస్తుందని వరి కోతలు మొదలై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొస్తున్నారు.

అయినా ప్రభుత్వం రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సూర్యాపేట జిల్లాలో అనేకమంది రైతాంగానికి మొదటి విడత అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతాంగానికి కావలసిన యూరియా, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి ఇవ్వాలన్నారు.

ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేసి లిఫ్ట్ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో ఐకెపి కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, బెరుకులు అనే సాకుతో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండాఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.

తెలంగాణ రైతు సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులుగా ఎర్రబోయిన మల్సూర్, నాగం మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, సిఐటియు మండల కన్వీనర్ దోసపాటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి మేకల ఉపేందర్, సిఐటియు సీనియర్ నాయకులు గుంట గాని ఏసు, నాయకులు సోమగాని మల్లయ్య, ఎడమ పద్మ, కక్కిరేణి సత్యనారాయణ, రాములు, మల్లయ్య, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.