9 August, 2026 | 5:18 AM

మోటర్లు ఆగలేదని ఏ ఆధారంతో అంటున్నారు?

08-08-2026 03:09 PM

ఆగస్టు 1 నుంచే కేఎల్‌ఐ పంపులు నడుస్తున్నాయి 

ఆగస్టు 7న కాలువలకు సాగునీటి విడుదల: ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి,(విజయక్రాంతి): కేఎల్‌ఐ పరిధిలో మోటర్లు నడవడం లేదని, రైతులకు సాగునీరు అందించడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా అన్నారు. నీటి పారుదల వ్యవస్థపై క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఆగస్టు 1 నుంచే నీటి ఎత్తిపోతలు

ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-1 ద్వారా ఆగస్టు 1 నుంచే నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటివరకు శ్రీశైలం నుంచి 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు పేర్కొన్నారు. ఎల్లూరు రిజర్వాయర్‌లో 0.34 టీఎంసీలు, సింగోటం రిజర్వాయర్‌లో 0.40 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. లిఫ్ట్‌-2 కూడా ఆగస్టు 1 నుంచే పనిచేస్తోందని, జొన్నలబొగడ రిజర్వాయర్‌లో 1.753 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. మూడు పంపుల ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 2,100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

కాలువలకు 2,100 క్యూసెక్కుల విడుదల

ఆగస్టు 8న ప్యాకేజీ-29 కల్వకుర్తి ఎడమ కాలువ ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆగస్టు 6న లిఫ్ట్‌-3ను ప్రారంభించామని, గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.42 టీఎంసీల నీరు ఉందన్నారు. ఆగస్టు 7న అన్ని కాలువలకు సాగునీటిని విడుదల చేశామని, ఆగస్టు 8న గుడిపల్లి రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి నీటిని కాలువలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాలే లక్ష్యం 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని మేఘారెడ్డి అన్నారు. పంపులు ఎప్పుడు ప్రారంభించామో, ఎంత నీటిని ఎత్తిపోశామో, రిజర్వాయర్లలో ఎంత నీరు ఉందో, కాలువలకు ఎప్పుడు నీటిని విడుదల చేశామో వివరాలతో వెల్లడిస్తున్నామని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుల నుంచి నీటిని వినియోగించుకోవాలంటే సంబంధిత అనుమతులు అవసరమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ విమర్శలు చేసే ముందు క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని నిరంజన్‌రెడ్డికి సూచించారు. రైతులు సాగు చేసిన పంటలకు నీరందించి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటన ద్వారా పేర్కొన్నారు.