తాసీల్దార్ ఆఫీస్‌లో స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు
వారానికి పైగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు
సాంకేతిక సమస్యలే కారణమంటున్న అధికారులు
షాద్‌నగర్, జూలై 10 (విజయక్రాంతి): సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూములు, స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వచ్చి సర్వర్ రాకపోవడంతో కొనుగోలుదారులు, విక్రయదారులు తాసిల్దార్ కార్యాలయం వద్దని పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
సుమారు 15 రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో నిత్యం కార్యాలయం చుట్టూ వచ్చి పోతున్నామని ప్రజలు అంటున్నారు. సర్వర్ ఎందుకు రావడం లేదని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తుంటే ఆన్లైన్ ప్రక్రియ స్తంభించిందిని చెప్పి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఎప్పుడు సర్వర్ వస్తుందో తెలియక ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు తాసిల్దార్ కార్యాలయానికి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాంకేతిక సమస్యను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఉన్న ఆస్తిలో కొంత భాగం విక్రయించి ఇబ్బందులను దూరం చేసుకుందామనుకుంటే సర్వర్ రాకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
వారానికి పైగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మొక్కుబడిగా సాగుతున్నప్పటికీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. సాంకేతిక సమస్యతో ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వస్తుందని ఆలోచన కూడా అధికారులు ఏమాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి సాంకేతిక సమస్యను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






