21 August, 2026 | 3:50 PM

బోనస్‌కు సాగు వివరాల నమోదు తప్పనిసరి

21-08-2026 02:33 PM

హుజురాబాద్, ఆగస్టు 21: (విజయక్రాంతి) వానాకాలం–2026లో తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు సన్న వడ్ల బోనస్ పొందేందుకు సాగు వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చందా భూమిరెడ్డి శుక్రవారం రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫర్టిలైజర్ డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత డీలర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. రైతులు సొంత వడ్లను విత్తనాలుగా వినియోగించినట్లయితే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. సీడ్ ప్లాంట్లు లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి విత్తనాలు కొనుగోలు చేసిన వారు కొనుగోలు రసీదు జిరాక్స్ ప్రతిని జత చేసి సంబంధిత ఏఈవోను సంప్రదించాలని సూచించారు. సాగు వివరాల నమోదుకు సెప్టెంబర్ 10, 2026 చివరి తేదీ అని తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదైన రైతుల తుది జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తామని చెప్పారు. నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందుతుందని స్పష్టం చేశారు.కావున రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే తమ సాగు వివరాలను నమోదు చేసుకోవాలని చందా భూమిరెడ్డి కోరారు.