రిమ్స్‌లో ముదురుతున్న రీల్స్ పిచ్చి
ఆపరేషన్ థియేటర్‌లలో రోగుల వార్డుల్లో రీల్స్ చిత్రీకరణ
ఖరీదైన యంత్రాలపై కూర్చొని రీల్స్ చేసిన మెడికోలు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిమ్స్ అధికారులు
ఆదిలాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సేవలకు ప్రధాన ఆధారమైన రిమ్స్ ఆసుపత్రిలో అధికారుల పర్యవేక్షణ లోపంతో మెడికోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని కొందరు మెడికోల రీల్స్ పిచ్చి రోజురోజుకు ముదురుతోంది. ఏకంగా ఆస్పత్రిని రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్టూడియోగా మార్చేశారు.
డ్యూటీ అయిన తర్వాత తమ హాస్టల్ గదుల్లో, ఇతర ప్రాంతాల్లో సరదాగా రీల్స్ చేస్తే పర్వాలేదు. కానీ డ్యూటీ సమయంలో అదికూడా ఆపరేషన్ థియేటర్ లలో, ఖరీదైనా యంత్రాలపై కూర్చొని రీల్స్ చిత్రీకరించడం చేస్తున్నారు. రోగుల వార్డుల్లో రోగులను పట్టుకుని రీల్స్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది. మెడికోలు చేస్తున్న రీల్స్‌లపై రిమ్స్ అధికారుల నియంత్రణ లేకపోవడంతోనే మెడికోలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రీల్స్ పిచ్చిలో పడి పవిత్రమైన వైద్య వృత్తినీ కొందరు మెడికోలు అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మెడికోలు అసలు ఎక్కడ ఏ పని చేయాలో తెలియనంత అజ్ఞానులేమీ కాదు. కానీ రీల్స్ పిచ్చిలో పడి వైద్య వృత్తి పవిత్రత దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని భావన ప్రజల నుండి వ్యక్తం అవుతోంది. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మెడికోలు, రిమ్స్ అధికా రులపై చర్యలు తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తోంది.




