30 May, 2026 | 1:34 AM

కొనుగోళ్లలో రికార్డ్

30-05-2026 12:43 AM
  1. లక్ష్యం 75 లక్షల టన్నుల ధాన్యం 
  2. ఇప్పటికే 60 లక్షల టన్నులు సేకరించాం
  3. దేశం వాటాలో తెలంగాణదే 60 శాతం  
  4. దిగుబడి పెరుగుతున్నా కేంద్రం కొనుగోళ్లు తగ్గిస్తోంది
  5. ప్రతి గింజనూ కొంటాం : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి  
  6. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలవి రాజకీయ విమర్శలు
  7. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు  

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : ధాన్యం దిగుబడిలోనే కాదు, కొనుగోళ్లలో నూ దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చే శారు. దేశ వ్యాప్తంగా చూస్తే అత్యధికంగా రాష్ట్రానిదే 70 శాతం భాగస్వామ్యం ఉందని, కొనుగోళ్లు పూర్తయ్యే నాటికి 75 శాతానికి చేరుకోవచ్చన్నారు.

శుక్రవారం సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, ఖమ్మం ఎంపీ రామసహాయం ర ఘురాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రభు త్వ లక్ష్యం 75 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటికే  60 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పారు.  

మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా కొనుగోళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో 24 లక్షల టన్నులు, తమిళనాడులో 11నుంచి 12 లక్షల టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల టన్నులు, కేరళలో 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోళ్లు కాగా.. తెలంగాణలో ఇప్పటి వరకు 60 లక్ష ల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. కేంద్ర ప్రభు త్వం తెలంగాణ నుంచి 52 లక్షల టన్నుల వరకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ, రాష్ట్రం ఇప్పటికే ఆ లక్ష్యాన్ని అధిగమించి 60 లక్షల టన్ను కొనుగోళ్లు పూర్తి చేసిందన్నారు.

ఇది రైతుల కష్టానికి, కాంగ్రెస్ ప్రభుత్వ రైతు పక్షపాత విధానాలకు నిదర్శనమని చెప్పారు. యా సంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 64.36 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, సుమారు 141 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచ నా వేస్తున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రా రంభానికి ముందే కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రతి సీజన్‌కు  వరి దిగుబడి పెరుగుతోందని, కానీ కేంద్రం ఎఫ్‌సీఐ  ద్వారా స్వీకరిస్తున్న బియ్యం పరిమాణాన్ని తగ్గిస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు రాష్ట్రంగా తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు, దాదాపు 13 వేల రవాణా వాహనాలు, 2 లక్షలకు పైగా సిబ్బందిని ప్రభుత్వం వినియోగించిందన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.11,050 కోట్లు నేరుగా జమ చేశామని తెలిపారు.  2025-- 26లో ఖరీఫ్, యాసంగి సీజన్లు కలిపి రైతులకు చెల్లింపులు, కొనుగోళ్లు, రవాణా తదితర కార్య కలాపాలకు దాదాపు రూ.39,300 కోట్ల వ్యయం జరుగుతుందన్నారు.     

అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం రాకుండా చర్యలు

అకాల వర్షాలకు తడిసిన 10,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించి రైతులకు నష్టం జరగకుండా కాపాడామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు, రవాణా, రైతులకు చెల్లింపులు, భారీ స్థాయిలో లాజిస్టిక్స్ నిర్వహణ వంటి అంశాల్లో తెలంగాణ సాధించిన విజయాన్ని చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు.

వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ ప్రేరేపిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ధాన్యం ఉత్పత్తి, కొనుగోళ్లు జరుగుతున్నాయని, రైతులు తీసుకొచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. బీజేపీ నాయకులకు రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు మరింత ధాన్యం కొనుగోలు కోటా, ఎఫ్‌సీఐ  స్వీకరణ లక్ష్యాలను పెంచాలన్నారు.