30 May, 2026 | 2:10 AM

తూకాలు సకాలంలో పూర్తి చేయాలి

30-05-2026 12:42 AM

అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

మేడ్చల్, మే 29(విజయ క్రాంతి): జిల్లాలోని మూడుచింతలపల్లి మండలం కొల్తూ రు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్  సుగుణా బాయి,జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి,  డిప్యూటీ తహసీల్దార్ భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రంలోని సౌకర్యాలను, ధాన్యం నాణ్యతను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకాలు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, కేంద్రానికి ధాన్యం తెచ్చే రైతులకు తాగునీరు,

నీడ వంటి కనీస వసతులు కల్పించాలని, తూకం వేసే ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా  చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రైతులకు దక్కేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిబంధనల ప్రకారం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.