19 July, 2026 | 6:57 PM

శాకంబరీ దేవిగా '7'పాయల వనదుర్గమ్మ..

19-07-2026 12:01 PM

ఆషాడమాసం.. బోనాల సంబురం..

ఏడుపాయల వనంలో కిక్కిరిసిన భక్తజనం 

మంజీరా నదీ పాయలో భక్తుల పుణ్యస్నానాలు 

వనదుర్గమ్మ దర్శనానికి బారులు

డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలతో బోనాలు, ఒడి బియ్యం సమర్పణ

పాపన్నపేట,జులై19: మంజీరా నది '7' పాయలుగా చీలి ప్రవహిస్తున్న ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. ఆధ్యాత్మిక వాతావరణం, ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, బండరాళ్లు, గలగల పారే గంగమ్మ పరవళ్ళు.. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నామనిపించే అనుభూతి.. ఇది పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం సొంతం.

ఆషాడ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని వనదుర్గామాతను శాకంబరీ దేవి రూపంలో విశేషంగా అలంకరించారు. వేకువ జామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాకంబరీ దేవి రూపంలో అమ్మవారు శోభాయ మానంగా భక్తులను దర్శనమిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు మంజీరా నదీ పాయలు, చెక్ డ్యామ్ లో పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు.

పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలతో బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆలయ పరిసరాల్లోని షెడ్లు, పచ్చని చెట్ల కింద భోజనాలు చేసి ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.