అక్రమంగా నిల్వ చేసిన 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు
రూ.2.25 లక్షల విలువైన బియ్యం స్వాధీనం
ఒకరు అదుపులో.. గోదావరిఖని–2 టౌన్ పోలీసులకు అప్పగింత
పెద్దపల్లి జిల్లా,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ముఠాపై కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్–నార్కోటిక్ బృందాలు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8 ఇంక్లైన్ కాలనీ, సంతోష్‌నగర్ ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో సుమారు 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మోతె కనుకయ్య (25) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం గోదావరిఖని–2 టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. ప్రజలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి విక్రయించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.






