జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్.. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు
జమ్మూ: భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జమ్మూ కాశ్మీర్‌లో(Jammu and Kashmir) బీభత్సం సృష్టిస్తున్నాయి. సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీలలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. పూంచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ముగ్గురు మహిళలతో సహా కనీసం నలుగురు మరణించారని, మరణాలన్నీ అత్యంత తీవ్రంగా ప్రభావితమైన సురాన్‌కోట్ తహసీల్ నుంచే నమోదయ్యాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో గ్రామాలు జలమయం కాగా, నీరు ఇళ్లలోకి చేరింది. వరద ఉధృతికి వాగులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. రాజౌరీలో పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. బేలా బస్టాండ్ పరిసరాలు పూర్తిగా జలమయం అయ్యాయి.
వరద ప్రవాహంలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. అక్కడ చిక్కుకుపోయిన వారిని చేరడానికి, ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయడానికి, భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించడానికి అధికారులు సహాయక బృందాలను మోహరించి, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నూనాబండి గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో నజియా కౌసర్ అనే 28 ఏళ్ల మహిళ మరణించింది. ఆమె భర్త మహ్మద్ హఫీజ్, రెండు నుండి ఆరు ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. లోయర్ ముర్రాలో మరో ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో, ఆ ఇంటి యజమాని మహ్మద్ లతీఫ్, కుటుంబానికి చెందిన మరో ఐదుగురు గల్లంతయ్యారు. తాజా సమాచారం అందే సమయానికి గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మార్హోట్‌లోని ఒక వాగులో ఇరామ్ అనే బాలిక మునిగి మరణించగా, ధుండక్ లతూంగ్ వంతెన సమీపంలోని వాగు నుండి ఒక మహిళ మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు.
పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ తహసీల్‌లో అత్యంత ఘోరమైన విధ్వంసం జరిగిందని, అక్కడే అత్యధిక మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, దెబ్బతిన్న రహదారుల మధ్య గల్లంతైన వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. రాష్ట్ర హోదా కోసం జరగాల్సిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో పరిస్థితులు క్షీణిస్తున్న దృష్ట్యా, రాజధానిలో తన పర్యటనను కుదించుకుని మధ్యాహ్నానికే జమ్మూకు తిరిగి వస్తానని చెప్పారు.
వర్షానికి ఉప్పొంగిన వరద.. నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు

నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా దరహాలి నది పొంగిపొర్లి, జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలోని బేలా ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 23 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, రక్షణ చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.






