మల్లన్న వార్షిక ఆదాయం రూ. 23.93 కోట్లు
కొమురవెల్లి, మే 17: రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలలో ఒకటిగా వెలుగొందుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామికి రికార్డు స్థాయిలో వార్షిక ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే స్వామివారికి భారీగా ఆదాయం సమకూరడం విశేషం. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23 కోట్ల 93 లక్షల 13వేల 385 రూపాయలు మల్లన్న స్వామి ఖజానాకు జమ అయింది.
2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.2.95 కోట్లు అధికంగా వచ్చిందని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. మల్లన్న వార్షిక ఆదాయం ఏటా కోట్లల్లో ఉంటోంది. ఈ ఆదాయం భక్తులు సమర్పించే కానుకలు, దర్శనం టికెట్లు, వివిధ రకాల వేలం పాటలు, ప్రసాద విక్రయాల తో పాటు పలు రకాల ఆర్జిత సేవల ద్వారా మల్లన్న స్వామికి సమకూరుతుంది.
రాష్ట్రంలో ఆదాయ ఆర్జనలో ప్రధాన దేవాలయాల యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజన్న దేవాలయం, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం వరుసగా మూడు స్థానాలు ఆక్రమించగా, తర్వాత స్థానం కొమురవెల్లి మల్లికార్జున స్వామిదే. గత రెండు సంవత్సరాల నుండి ఏటా రెండు కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.
గతంతో పోలిస్తే 2024-25 సంవత్సరం 2.23 కోట్ల అధికంగా ఆదాయం రాగా, 2025-26 ఆర్థిక సంవత్సరం 2.95 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రతి ఏటా మల్లన్న స్వామి ఆదాయం పెరుగుతుండడం విశేషం.1956 సంవత్సరంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళింది. అప్పటి వార్షిక ఆదాయం రూ.1500 తో ప్రారంభమై, నేడు 23 కోట్లకు చేరడం గమనార్హం.






