30 July, 2026 | 2:54 PM

బాన్సువాడ లో వీధి కుక్కల బీభత్సం పై ప్రజల ఆగ్రహం

30-07-2026 02:33 PM

రెండు రోజుల్లో 11 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి

మున్సిపల్ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బీభత్సం రోజురోజుకూ పెరుగుతుంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు దాదాపు 11 మంది చిన్నారులు వీధి కుక్కల కాటుకు గురికావడం పట్టణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం ఒక్కరోజులోనే పట్టణంలోని పలు ప్రాంతాల్లో 6 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గాయపడిన చిన్నారులను స్థానికులు వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ కు తరలించారు.

వరుసగా చిన్నారులపై వీధి కుక్కలు దాడులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను బయటకు పంపేందుకు కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది.పట్టణంలో వీధి కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు, కుక్క కాటుకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.ప్రమాదకరంగా సంచరిస్తున్న వీధి కుక్కలను వెంటనే పట్టుకుని తరలించడంతో పాటు, వాటి నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.