ఆగస్టు 4న హైదరాబాద్‌లో చేనేత సహకార సంఘాల సదస్సు
చిట్యాల,(విజయక్రాంతి): ఆగస్టు 4న హైదరాబాద్ ఆటోనగర్‌లోని కర్నాటి గార్డెన్స్‌లో తెలంగాణ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ తెలిపారు. ఈ మేరకు గురువారం చిట్యాలలో సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను మాఫీ చేయాలని, త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వ చేనేత వస్త్రాల ఆర్డర్లను సహకార సంఘాలకే కేటాయించాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘాలకు ప్రత్యేక గ్రాంటు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కందగట్ల గణేష్, చిట్యాల చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గంజి సుధాకర్, ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.






