కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోం
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ పై బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటుకు సిద్ధం
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్
హుజురాబాద్,(విజయక్రాంతి): బీజేపీ దేశంలో ఎస్ఐఆర్ పేరుతో అక్రమ చొరబాటుదారుల పేరు చెప్పి పేద, మధ్య తరగతి ఓటర్లను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసిసి పరిశీలకులు ఆడమ్ రాజ్ డెక్కపాటి, రాష్ట్ర పిసీసీ ప్రధాన కార్యదర్శి కాశపాక రాజేష్ లతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. దేశంలో ఎస్ఐఆర్ విధానం వల్ల పన్నెండు రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం జరిగిందని, ఇలాంటి తప్పులు తెలంగాణలో జరగకుండా ఉండడానికి నియోజకవర్గ పరిధిలో ప్రతి బూత్ కి బూత్ లెవల్ కమిట్ మెంబర్ లను రాష్ట్ర పిసీసీ కి అందిస్తున్నామని, దీనిపై మొన్నటి ఎలక్షన్లలో దొర్లిన తప్పులు ఇప్పుడు దొర్లకుండా ఈ కమిటీ చూసుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర పిసీసీ తో పాటు డిసిసిల వద్ద సమాచారం వద్ద ఉంటుందని, ఏదైనా ఓటుహక్కు విషయంలో సమస్య ఏర్పడినప్పుడు పరిష్కారానికి ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని, బీహార్ రాష్ట్రంలో అక్రమ చొరబాటు దారుల పేర్లతో అనేక మంది మైనారిటీ, బీసీ, ఎస్సీల ఓట్లను తొలగించారని, దీనిపై రాహుల్ గాంధీ వివరంగా ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించారని అన్నారు.




