16 April, 2026 | 4:05 AM

టాప్ లేపిన ఆర్‌సీబీ

16-04-2026 02:18 AM

చిత్తుగా ఓడిన లక్నో

రసిక్ సలామ్ దార్ నిప్పులు

భువనేశ్వర్ అదిరిపోయే స్పెల్

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే దుమ్మురేపుతోన్న ఆర్‌సీబీ మరోసారి ఆల్ రౌండ్ షోతో మెరిసింది. టోర్నీ సాగేకొద్దీ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తూ అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపింది. రసిక్ సలామ్ దార్, భువనేశ్వర్ కు మార్ నిప్పులు చెరగడంతో లక్నో చేతులెత్తేసింది. బ్యాటింగ్‌లో కోహ్లీ మెరుపులతో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. ఈ విజయంతో బెంగళూరు టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. 

బెంగళూరు, ఏప్రిల్ 15: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయిం ట్స్ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. అ యితే ఆర్సీబీ తొలిసారి విరాట్ కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఈ సారి మెరుపు ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న మార్కరమ్ 12 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. మరో ఓపెనర్ మిఛెల్ మార్ష్ ధాటిగా ఆడు తున్నా.. మరోవైపు లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది.

పంత్ (1), పూరన్ (1), అబ్జుల్ సమద్ డకౌట య్యారు. మిఛెల్ మార్ష్, ఆయుశ్ బదోనీతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 36 పరుగులు జోడించారు. మార్ష్ (40) పరుగులకు వెనుదిరిగినా బదోనీ 38 పరుగులు చేశాడు. అలాగే ముకుల్ చౌదరి మరోసారి చివర్లో మెరుపులు మెరిపించాడు. అతను ధాటిగా ఆడిన కారణంగానే లక్నో స్కోరు 140 దాటగలిగింది. చివర్లో టెయిలెండర్లు వెంటవెంటనే ఔటవడం తో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలామ్ దార్  అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టాడు.

4 వికెట్లు పడగొట్టాడు. మార్కరమ్, బదోనీ, ముకుల్ చౌదరి, అవేశ్ ఖాన్‌లను ఔట్ చేశాడు. ఇదిలా ఉంటే వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా 3 కీలక వికెట్లతో లక్నోను దెబ్బకొట్టాడు. తర్వాత ఛేజింగ్‌లో ఫిల్ సాల్ట్(7) త్వరగానే ఔటైనప్పటకీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన విరాట్ కోహ్లీ క్లాసిక్ షాట్లతో అలరించాడు. వరుస బౌండరీలతో టార్గెట్ ఒత్తిడి కనిపించకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కోహ్లీ కేవలం 34 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 49 పరుగులు చేశాడు. కోహ్లీ, పడిక్కల్ రెండో వికెట్‌కు 57 పరు గుల భాగస్వామ్యం నెలకొల్పారు.

కోహ్లీ ఔటైన తర్వాత పడిక్కల్ (10) కూడా వెనుదిరగ్గా, పటిదార్ 13 బంతు ల్లో 27, జితేశ్ శర్మ 9 బంతుల్లో 23 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటవడంతో బెంగళూరు ఐదు వికెట్లు కోల్పోయినా అప్పటికే విజయం ఖరారైంది. తర్వాత రూథర్ ఫర్డ్, టిమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. చివరికి బెంగళూరు 15.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసింది.  ఈ విజయంతో బెంగళూరు 8 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కంటే మెరుగైన రన్ రేట్ కారణంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

స్కోరు బోర్డు

లక్నో సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్ : 146 ( మార్ష్ 40, ముకుల్ చౌదరి 39, ఆయుశ్ బదోనీ 38 ; రసిక్ సలామ్ దార్ 4/24, భువనేశ్వర్ కుమార్ 3/27 )

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 149/5 ( కోహ్లీ 49, పటిదార్ 27, జితేశ్ శర్మ 23 ; ప్రిన్స్ యాదవ్  3/32, అవేశ్ ఖాన్ 2/23)