పక్కా పథకం ప్రకారమే రథ్ హత్య
- ఘటనా స్థలంలో కారు గుర్తింపు.. కీలక ఆధారాల సేకరణ
- కారుకు నకిలీ నంబర్ ప్లేట్ వినియోగం
- విచారణ వేగవంతం.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
కోల్‌కతా, మే ౭: బంగాల్ ప్రతిపక్ష నేత, కాబోయే సీఎం సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ౨౪ పరగణాల జిల్లాలో బుధ వారం రాత్రి చంద్రనాథ్ రథ్ పర్యటిస్తుండగా, మధ్యమ్‌గ్రామ్ వద్ద కారును చుట్టు ముట్టి దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య వెనుక సుపారీ ముఠా హస్తం ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఘటనలో రథ్ అక్కడికక్కడే తీవ్రగాయాలతో మరణించగా, డ్రైవర్ బుద్ధదేవ్ బేరా పరిస్థితి విషమంగా ఉంది.
షూటౌట్‌లో దుండగులు వాడిన ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుపై సిలిగుడి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నప్పటికీ, అది నకిలీదని విచారణలో తేలింది. నిందితులు కారు నంబర్ ప్లే ట్‌ను కావాలనే మార్చారని ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు బుల్లెట్లను, గన్‌పౌడర్‌ను సేకరించారు. రథ్‌ను హతమార్చేందుకు దుండగులు కొన్ని కిలోమీటర్ల నుంచే వెంబడించినట్లు పోలీసులు ఆ ప్రాం తంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి తేల్చారు.
నిందితులు కారుతో పాటు బైక్‌లపై కూడా వచ్చినట్లు గుర్తించారు. హత్యకు రెండు వడు రోజుల ముందే దుండగులు మూడురోజుల ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా హంతకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడింది స్థానిక నేరగాళ్లా లేక బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠా సభ్యులా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
బీజేపీ నేతల ఆగ్రహం..
రథ్ హత్య బంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. రథ్ హత్యపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని సువేందు ఓడించినందుకే, తన పీఏను టీఎంసీ నేతలు సుపారీ ఇచ్చి హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. కొందరు నేతలైతే భట్టాచార్య అనే టీఎంసీ నేత హత్య చేయించారని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే రథ్‌ను దుండగులు మ ట్టుపెట్టారని, ఇది రాజకీయ హత్యనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికార టీఎం సీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చు తూ, బీజేపీ శవ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నది. సువేందు వద్ద అత్యంత సన్నిహితులుగా పనిచేస్తున్న వారు హత్యకు గురికావడం లేదా అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇదే ప్రప్రథమమేమీ కాదు. గడిచిన 13 ఏళ్లలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ౨౦౧౩లో ప్రదీప్ ఝా అనే సువేందు పీఏ తూర్పు మేదినీపూర్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 2018లో సుశబ్రత చక్రవర్తి అనే సెక్యూరిటీ ఆఫీసర్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2021లో పులక్ లాహిరి అనే పీఏ అనుమానాస్పద స్థితిలోనే మృతిచెందాడు. ఈకేసు విషయంలోనూ విచారణ సాగుతున్నది.






