28 April, 2026 | 2:47 AM

మట్టి మటాష్!

28-04-2026 12:49 AM

మానుకోటలో యదేచ్చగా మన్ను దోపిడీ

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో మట్టి దోపిడీ యదేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో చేపట్టిన గ్రీన్ ఫీల్ హైవే, మూడవ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పేరుతో మట్టి గుట్టలను గుటకాయ స్వాహా చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖతోపాటు అటవీ, చెరువులు, కుంటలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూముల్లోని మట్టిని రేయింబవళ్ళు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనులకు అనుమతి పేరుతో గోరంత తవ్వాల్సింది పోయి కొండంత తొవ్వుకు వెళ్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 

మూత పడ్డ గ్రానైట్ క్వారీల నుంచి మట్టి రవాణా

మహబూబాబాద్ జిల్లాలో పలుచోట్ల ఉన్న గ్రానైట్ క్వారీల్లో అనేకం మూతపడ్డాయి. వివిధ కారణాలతో మూతపడ్డ గ్రానైట్ క్వారీల నుండి ఇప్పుడు మట్టి రవాణా జోరుగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ రాళ్లకు బదులు మట్టి రవాణా చేస్తున్నప్పటికీ మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. గ్రానైటు క్వారీల నుంచి కేవలం రాయి మాత్రమే ఎగుమతికి అనుమతి ఉంటుందని, అయినప్పటికీ కొందరు మట్టి అక్రమంగా తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

చెరువులను చెరబడుతున్నారు

ఇక అనేక చోట్ల చెరువులు, కుంటల్లో మట్టి అక్రమ రవాణా సాగుతోంది. కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, గూడూరు, మహబూబాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన చెరువుల్లో మట్టిని యంత్రాల ద్వారా తవ్వి పెద్దపెద్ద డంపర్లతో తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పూడికతీత పేరుతో కొందరు అనుమతులు పొంది, నిబంధనలకు విరుద్ధంగా అధికారుల పర్యవేక్షణ లేకుండా చెరువులను చెరబడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో కేవలం పూడిక మట్టిని మాత్రమే తీయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా, ఇష్టానుసారంగా మట్టిని తీస్తూ చెరువుల రూపురేఖలను మార్చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. చెరువుల్లో పూడికతీతమట్టిని పంట పొలాల్లో రైతులు పోసుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లాతో పాటు నల్గొండ, సూర్యపేట జిల్లాలోని వివిధ ప్రాంతాలను ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. 

అటవీ శాఖ భూముల్లో మట్టి కూడా..

కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల నుండి కూడా మట్టి రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రానైట్ క్వారికి అనుమతి పొంది రాళ్లు తీయకుండా మట్టి తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టి

గ్రీన్ఫీల్ హైవే, రైల్వే మూడో లైన్ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మట్టి రవాణా కు తెరతీసిన అక్రమార్కులు ఇతరులకు మట్టి విక్రయిస్తూ కాసులు దండిగా దండుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తులకు ఒక్కో డంపర్ కు 6000 నుండి 7వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక ఇటుక బట్టీలకైతే నల్ల రేగడి మట్టిని 10,000 నుంచి 15 వేల వరకు తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎండాకాలంలో ఇటుక బట్టీలకు, ఇతర ప్రైవేటు నిర్మాణాలకు మట్టి కి భారీగా డిమాండ్ ఉండడంతో ఇదే అదనుగా చేసుకొని మానుకోట జిల్లాలో మట్టి రవాణాకు తెర తీసి మట్టి రవాణా జోరుగా సాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

పట్టించుకోని అధికారులు

అక్రమంగా మట్టి రవాణా సాగుతున్నప్పటికీ ఎక్కడ కూడా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకుండా ‘మామూలు’గా వదిలేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నీటిపారుదల శాఖ, అటవీశాఖ, రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం, అక్రమార్కులకు కలిసొస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయంపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించగా ఎవరికి వారు మా పరిధిలోకి రాదంటూ దాటవేస్తుండడం విడ్డూరంగా మారింది. ఇలా ఎవరికివారు తమ పరిధిలోకి రాదంటూ దాటవేస్తుండడంతో మానుకోట జిల్లాలో మట్టి దోపిడీ, అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుంది. ఉన్నత స్థాయి అధికారులు అక్రమంగా మట్టి తరలింపుపై చర్యలు తీసుకొని అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.