ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి
హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఆదేశాలు
నాణ్యమైన వైద్యం, పరిశుభ్రత, సకాలంలో సేవలపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల విస్తరణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, గతంతో పోలిస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఈ సేవలను మరింత విస్తరించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడంతో పాటు ఆధునిక వైద్య పరికరాల కొనుగోలు, సూపర్ స్పెషాలిటీ సేవల బలోపేతం, స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, శానిటేషన్ సిబ్బంది యూనిఫాం ధరించడం, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించడం, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం తప్పనిసరి, 36 వారాలు దాటిన గర్భిణులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకుండా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే అభివృద్ధి పనులకు వినియోగించాలని తెలిపారు. ప్రతి రోగికి సకాలంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, మాతా-శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.






