29 August, 2026 | 8:55 AM

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

29-08-2026 12:14 AM

మహబూబాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీ సోదరుల బాంధవ్యానికి రక్షణగా నిలుస్తున్న రాఖి పండుగ సందర్భంగా సోదరీ సోదరీమణులు ఈ వేడుకల్లో ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. సోదరీమణుల చేత రాఖీలు కట్టించుకున్న సోదరులు అక్కాచెల్లెళ్లకు కట్న కానుకలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

సోదరీమణులు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి తమకు రక్షణగా ఉంటూ, ఆప్యాయత అనురాగాలను కలకాలం ఇలాగే కొనసాగించాలని ఆకాం క్షించారు. మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జర్నలిస్టులకు రాఖీలు కట్టి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు అందించారు. పలుచోట్ల పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ చెట్లను కాపాడుతామని వృక్షాలకు రాఖీలు కట్టారు. ముఖ్యమంత్రికి రాఖీలు కట్టిన మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క శుక్రవారం హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసంలో రాఖీలు కట్టారు.