27 June, 2026 | 2:36 AM

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

27-06-2026 12:11 AM

చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి 

మంచిర్యాల క్రైమ్, జూన్ 26 : రాష్ట్ర ప్రభుత్వం చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్ర వారం మంచిర్యాలలోని రజక సంఘ భవనంలో జూలై 6న హైదరాబాదులో జరిగే చాకలి ఎస్సీ సాధన సమితి తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజకుల సంక్షేమం దృష్ట్యా రజక ఫెడరేషన్ కు రూ. 9 వేల కోట్లు నిధులు కేటాయించాలని, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రజకులను ఇచ్చిన మాట ప్రకారం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ప్రమాద వశత్తు చనిపోయిన వారికి కార్మిక చట్టం వర్తింపజేసి రూ. 5 లక్షల భీమా అందించాలని, చాకలి ఐలమ్మ పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయాలని, ట్యాంకు బాండ్ మీద ఐలమ్మ విగ్రహం ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

బీహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే శ్యామ్ రజక్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ మాదరపు యాదగిరిలు హాజరవుతున్న మహాసభకు అధిక సంఖ్యలో రజకులు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ రజక సంఘం అధ్యక్షులు పారుపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోశం, ఉపాధ్యక్షులు పోచంపల్లి ధర్మయ్య, నల్లూరి మల్లయ్య, ముఖ్య సలహాదారు నేరెళ్ల రమేష్, రజక సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.