రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయం
మహబూబ్‌నగర్, ఆగస్టు 22: హైదరాబాద్ నగర తొలి పోలీస్ కమిషనర్, విద్యావేత్త, సామాజిక సంస్కర్త కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి సేవలు చిరస్మరణీయమని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని 22వ డివిజన్ పద్మావతి కాలనీలో శనివారం రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, మూఢ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి తదితరులు హాజరై వెంకట్రామా రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పేద విద్యార్థులకు వసతి, విద్య అందించాలనే ఉద్దేశంతో అబిడ్స్‌లో ‘రెడ్డి హాస్టల్’ను స్థాపించిన మహనీయుడు రాజా బహదూర్ వెంకట్రామా రెడ్డి అని కొనియాడారు. ఆయన కృషి వల్ల ఎందరో మేధావులు, నాయకులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. అదేవిధంగా ఆ కాలంలోనే బాలికల విద్యకు ప్రాధాన్యతను గుర్తించి బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనమన్నారు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మహనీయుల ఆశయాలు, అడుగుజాడల్లో నడుస్తూ మున్సిపల్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రతాప్ గౌడ్, మైత్రి యాదయ్యతో పాటు స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






