రైతుల పక్షాన పోరాటం చేస్తాం..
భూభారతి పేరుతో రైతుల భూములను హరించే ప్రయత్నం
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో రైతుల భూములను హరించే ప్రయత్నం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(BRS MLA Kova laxmi), మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలోని 22ఏ కింద అమాయక రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. పట్టణాల్లో భూకబ్జాలకు పాల్పడుతున్న ప్రభుత్వం, పల్లెల్లో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల భూములపై కూడా కన్నేసిందని ఆరోపించారు. అక్రమ వసూళ్ల కోసమే 22ఏ నిబంధనను తీసుకొచ్చారని విమర్శించారు.పారదర్శక పాలన అందిస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. అర్హులైన రైతుల భూములను 10 రోజుల్లోగా నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే ప్రభుత్వంపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. భూభారతి చట్టం చివరకు ‘భూ స్వాహా చట్టం’గా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ అలీ బిన్ హైమద్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, బాలకృష్ణ, సలాం, నాయకులు గంధం శ్రీనివాస్, గుండా శ్యామ్, జీవన్, అన్సార్, రవి తదితరులు పాల్గొన్నారు.






