మరో రెండు రోజులు వర్షాలు
- నేడు పలు జిల్లాల్లో భారీగా, రేపు మోస్తరుగా..
- 10 నుంచి 16 మధ్య అధికంగా వానలు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురువనున్నాయి. ఈ వారంలో సాధారణ స్థాయిలో వర్షాలు కురువగా, ఈనెల 10 నుంచి 16 మధ్య మాత్రం ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు, సోమవారం ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
శనివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సోమవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈనెల రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వర్షాలు కుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 10 నుంచి 16 మధ్య సాధారణం కన్నా ఎక్కువగా, ఈనెల 9 వరకు మాత్రం సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.






