21 August, 2026 | 1:39 AM

అమ్మను గర్వంగా చూస్తున్న నాన్న

21-08-2026 12:53 AM

తల్లీ నీ కష్టాలు నాకు, ప్రియాంకకే తెలుసు

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి రాహుల్‌గాంధీ నివాళి

నవంబర్‌లో సోనియాగాంధీ ఆత్మకథ

మార్కెట్‌లోకి రానున్న ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ‘అమ్మను గర్వంగా చూస్తున్న నాన్న’, ‘తల్లీ నీ కష్టాలు నాకు, నా చెల్లెలు ప్రియాంకకే తెలుసు’ అని తన మాతృమూర్తి సోనియాగాంధీ ఆత్మకథపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. గు రువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయనకు రాహుల్‌గాంధీ నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 10న విడుదల కానున్న తన తల్లి ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ను ‘త్వరలోనే ఆమెను ప్రేమించే లక్షలాది మంది చదువుతారని’ తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఆమెలాంటి గోప్యత పాటించే వ్యక్తికి తన అంద మైన కథను ప్రపంచానికి చెప్పడం ఎంత కష్టమో తనకే తెలుసని అన్నారు. సోనియాగాంధీ నవంబర్‌లో తన ఆత్మకథను విడు దల చేయనున్నారు.

‘బహిరంగ రాజకీయ ప్రపంచంలోకి’ అడుగుపెట్టిన విషాదం, 2004లో ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వంటి తన వ్యక్తిగత కథను పంచుకో నున్నారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న మార్కెట్లోకి రానుందని, పెంగ్విన్ రాండమ్ హౌస్ అమెరికన్ అనుబంధ సంస్థ అయిన ఆల్ఫ్రెడ్ ఎ నాఫ్ మంగళవారం ప్రకటించింది. అయితే, భారతదేశంలో ఈ పుస్తకం విడుదల తేదీని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ఇంకా ధ్రువీకరించలేదు. రాహుల్ గాంధీ తన ఎక్స్ లో కూడా ఇలా పోస్ట్ చేశారు.

‘అమ్మా, నేను మిమ్మల్ని, నాన్నను కలిసి చివరిసారిగా 35 సంవత్సరాల క్రితం చూశాను. 1991లో నా న్న మమ్మల్ని విడిచి వెళ్లిన రోజు నుంచి, జీవితం మీపై విసిరిన ప్రతీ సవాల్‌ను మీరు అంతులేని ధైర్యంతో, గౌరవంతో ఎదుర్కోవ డం చూశాను’ అని పేర్కొన్నారు. ‘మీరు ఏమి అనుభవించారో, నాన్న తర్వాత మీ జీవితం నిజంగా ఎంత కష్టంగా గడిచిందో ప్రియాంకకు, నాకు మాత్రమే నిజంగా తెలు సు’ అని తెలిపారు. ‘మీ కథ --‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ -- చివరకు మిమ్మల్ని ప్రేమించే లక్షలాది మంది ప్రజలచే చదవబడుతున్నం దుకు నేను సంతోషంగా, చాలా గర్వంగా ఉన్నాను. మీలాంటి గోప్యత పాటించే వ్యక్తికి మీ అందమైన కథను ప్రపంచా నికి చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అని ఆయన అన్నారు.

గురువారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘నాన్న తన అందమైన సోనియా వైపు గర్వంగా చూస్తూ నవ్వుతున్నట్లు నాకు కనిపిస్తోంది’ అని అన్నారు. సోనియా తన జీవిత ప్రయాణంపై రాసిన ఆత్మకథను నాఫ్ ప్రచురణ సంస్థ నవంబరు 10న హార్డ్ కవర్, ఈ-బుక్ రూపంలో విడుదల చేయనుంది. దీని ఆడియో ఎడిషన్‌ను పెంగ్విన్ రాండమ్ హౌస్ అందుబాటులోకి తీసుకురానుంది. తొలి ముద్రణలో లక్ష కాపీలను ముద్రించనున్నట్లు ప్రచురణకర్త తెలిపారు. మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘట్టాలు, విషయాలను పుస్తకంలో పంచుకున్నట్లు సోనియా తెలిపారు.

ఇందులో రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి వంటి విషయాలను పేర్కొన్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావడం, అందుకు దారితీసిన పరిస్థితులను పంచుకున్నట్లు ఆమె వివరించారు. తన కుటుంబం గురించే ఎక్కువగా ప్రస్తావించినట్లు తెలిపారు. రాహుల్‌గాంధీ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా తన తండ్రి రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. తన కథను ‘ఎంతో హృదయపూర్వకంగా, నిజాయితీగా’ రాసినందుకు తన భార్యను చూసి రాజీవ్‌గాంధీ గర్వపడి ఉండేవారని ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు.