21 August, 2026 | 1:50 AM

నా బిడ్డ వ్యాఖ్యలకు నాకు షోకాజా?

21-08-2026 01:06 AM

నాకిచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ సంఘం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కోరారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, వాటితో తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి సురేఖ గురువారం వివరణతో కూడిన లేఖ రాశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్య త వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని సురేఖ పేర్కొన్నారు.

తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీచేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి విజ్ఞప్తి చేశారు.

ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు  నిర్వహించారని తెలిపారు.  తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె ముఖ్య అతిథిగా పాల్గొ న్నారని వివరించారు.