21 August, 2026 | 1:28 AM

100 కోట్ల అవినీతి సామ్రాజ్యం!

21-08-2026 01:00 AM
  1. ఇబ్రహీంపట్నం డీఏవో శ్రీనివాస్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు 
  2. అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 
  3. ఆయన నివాసం, కార్యాలయంతో పాటు ఐదు ప్రాంతాలలో సోదాలు 
  4. నల్లవెల్లి గ్రామంలో 10 ఎకరాల భూమి 
  5. రెండు ఫ్లాట్లు, ౮ ఓపెన్ ప్లాట్లు, భవనాలు 
  6. ఇంట్లో కిలో బంగారం 
  7.    2009లోనే ఏసీబీ కేసు నమోదైనా మారని తీరు

రంగారెడ్డి, ఆగస్టు 20 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్ (డీఏవో)గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాసరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడంతో ఏసీ బీ అధికారులు ఆయనను గురువా రం అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్‌లోని హస్తినాపురం సంతోషిమాత కాలనీలో ఉన్న ఆయన నివాసం, కార్యాలయంతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.

దాడుల్లో స్థిరాస్తులు, భూములకు సంబంధించిన పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్మన్‌ఘాట్‌లో రెండు ఫ్లాట్లు (రూ.2.63 కోట్లు), సరూర్ నగర్‌లో జీ+3 పెంట్‌హౌస్ (రూ.1.61 కోట్లు), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో 10.08 ఎకరాల వ్యవసాయ భూమి (రూ.25.50 లక్షలు), నగర సరిహద్దుల్లో 8 ఓపెన్ ప్లాట్లు (రూ.62.84 లక్షలు) గుర్తించారు.

బాలాపూర్‌లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్‌లో కుమారుడి పేరిట భాగస్వామ్యంతో పెట్టిన రూ.86 లక్షల పెట్టుబడి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. దాంతో పాటు బ్యాలెన్స్, కిలో బంగారం, రూ.4 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.8.60 లక్షల రూ.59 లక్షల విలువైన 3 కార్లు, 2 బైకులు, రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.6. 87 కోట్లుగా తేలగా, బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. కాగా గతంలో శ్రీనివాస్‌రెడ్డి 2009లో మహేశ్వరం మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.