21 August, 2026 | 2:43 AM

హార్డ్ కాపీ పేరుతో రెవె‘న్యూ’ వసూళ్లు

21-08-2026 12:55 AM

ప్రతి సర్టిఫికెట్‌కు కొంత సమర్పించుకోవాల్సిందే!

మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలను పూర్తిగా పారదర్శకంగా, డిజిటల్ విధానంలో, పేపర్ లెస్ ప్రక్రియ ద్వారా అందజేయడానికి ఇటీవల ప్రత్యేకంగా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఎవరైనా దరఖాస్తుదారుడు తమకు అవసరమైన సర్టిఫికెట్ కోసం మీసేవ కేంద్రానికి వెళ్లి తగిన ధ్రువపత్రాలను అందజేసి నిర్ణీత రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారా రెవెన్యూ శాఖ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విచారణ ప్రక్రియను పారదర్శంకంగా నిర్వహించడానికి ప్రత్యేక యాప్ ను పొందుపరచి జిపిఓ (గ్రామపాలన అధికారులు), ఆర్‌ఐలకు లాగిన్స్ కూడా ఇచ్చారు.

ఇందులో భాగంగా మీసేవలో దరఖాస్తు చేసుకోగానే సంబంధిత గ్రామ పాలన అధికారి లాగిన్ లోకి దరఖాస్తు వెళుతుంది. ఆ దరఖాస్తును ఓపెన్ చేయగానే దరఖాస్తుదారుడు ఆ దరఖాస్తుకు సంబంధించి అప్లోడ్ చేసిన పత్రాలు కనిపిస్తాయి. వాటిని పూర్తి స్థాయిలో సమీక్షించి సంబంధిత ఆర్‌ఐ లాగిన్ కు పంపిస్తారు. ఆర్‌ఐ సంబంధిత గ్రామపరిపాలన అధికారి రిపోర్ట్ ను ఆధారం చేసుకుని దరఖాస్తును ఆమోదించడమో లేదా రిజెక్ట్ చేయడమో చేస్తూ తహశీల్దారుకు ఆన్ లైన్లో పంపిస్తారు.

ఇదంతా పూర్తిగా ఆన్లైన్ విధానం కాగా ఈ విధానానికి తూట్లు పొడుస్తూ జిల్లాలోని తహశీల్దారు కార్యాలయాలలో కొందరు అధికారులు దరఖాస్తులను నేరుగా తెస్తేనే ఆమోదిస్తామని ఖరాఖండిగా చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖల్లలో పేపర్ లెస్ విధానం తీసుకురాగా తెలంగాణ ప్రభుత్వం, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ద్వారా అందరు కలెక్టర్లకు సర్క్యులర్ జారీ చేస్తూ, మీసేవ కేంద్రాల ద్వారా ఎటువంటి పత్రాలను అడగకుండా, రశీదు జారీ విధానాన్ని కూడా పూర్తిగా తొలగించారు.

జిల్లాలో కొందరు అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశాలు పాటిస్తుండగా మరి కొందరు పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల తహసిల్దార్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు దరఖాస్తుదారులను మీసేవ నుండి హార్డ్ కాపీ తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. మీసేవ నుండి హార్డ్ కాపీ తీసుకు వెళ్లిన తర్వాత లేనిపోని కొర్రీలు పెడుతూ ఆదాయ, కుల, నివాస తదితర ధ్రువృవీకరణ పత్రాలకు 100, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, గ్యాప్ సర్టిఫికెట్ సర్టిఫికెట్లకు అయితే ఏకంగా 500 రూపాయలు అడుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.

ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ విధానంలో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిర్వహిస్తుండగా రెవె‘న్యూ’ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగులు హార్డ్ కాపీ పేరుతో తమ వద్దకు పిలిపించుకొని సరి‘కొత్త’ వసూళ్లకు తెరలేపినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఆఫీసుకు వచ్చి కలిస్తే సర్టిఫికెట్ వెంటనే ఇస్తారట

మా బిడ్డ చదువు కోసం కులం ధ్రువీకరణ పత్రం మీసేవ ద్వారా దరఖాస్తు చేశాను. సర్టిఫికెట్ వెంటనే రావాలంటే కాగితాలు పట్టుకొని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాలని చెప్పారు. ఇక్కడ ఆఫీసులో ఇస్తే వెంటనే సర్టిఫికెట్ ఇస్తారంటే మీ సేవ దరఖాస్తు తీసుకొని వచ్చాను. ఆన్లైన్ విధానం విషయం నాకు ఎవరు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేదు. 

సూరయ్య, అమీనాపురం *ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వకూడదు

మీసేవ కేంద్రం నిర్వాహకులు దరఖాస్తుదారులకు ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వకూడదు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసిన ఆయా శాఖలకు సంబంధించి ఆన్లైన్ ద్వారానే అధికారులు పరిశీలిస్తారు. అనంతరం అవసరమైన ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఎవరికి కూడా అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించొద్దు. సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరిగినా, అదనంగా ఎవరైనా డబ్బులు చెల్లించాలని అడిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫిర్యాదు చేయాలి. పూర్తిగా పేపర్ లెస్ విధానం అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 

-యుగంధర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, మహబూబాబాద్