24 July, 2026 | 3:51 AM

యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు

24-07-2026 01:52 AM

బాధ్యులందరినీ ప్రభుత్వమే వెనకేసుకొచ్చింది

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రను బర్తరఫ్ చేయాలి

విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి

ప్రధాని మోదీ ప్రకటనపై ఎక్స్‌లో రాహుల్‌గాంధీ డిమాండ్

న్యూఢిల్లీ, జూలై 23: ‘యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు. వారి భవిష్యత్‌కు అతిపెద్ద ముప్పు కూడా మీరే..అత్యధికంగా నష్టం కలిగించింది మీరే..’ అని ప్రధాని మోదీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ ప్రకటనతో సమస్య పరిష్కారం కాదని మోదీ ప్రకటనను ఆయన ఖండించారు.

బాధ్యులందరినీ ప్రభుత్వమే వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రను బర్తరఫ్ చేయాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహించారు. ‘యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు’.. అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు.

ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ ‘ఎక్స్’ వేదికగా రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతోందన్న ప్రధాని మాటలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ‘మన దేశ యువత భవిష్యత్తుకు అతిపెద్ద ద్రోహం చేసి, దానిని నాశనం చేసింది మీరే. అలాగే ప్రోత్సహించారు.- అంతేకాక, దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరినీ మీరు కాపాడారు’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా దిగజారిపోయేలా, కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించిందని, బాధ్యులందరినీ ఈ ప్రభుత్వమే వెనకేసుకొచ్చిందని ఆయన విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రకటనతో సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేసిన రాహుల్‌గాంధీ, విద్యార్థులు, విపక్షాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లను మరోసారి గుర్తుచేశారు. పేపర్ లీక్ అంశానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకోవాలి లేదా ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన దాడులకు, వారిని ఇబ్బంది పెట్టిన తీరుకు ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.