అన్యాయాన్ని ప్రశ్నించడమే ‘అల్లూరి’కిచ్చే నివాళి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ‘సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం, అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. కేవలం 27 ఏళ్ల ప్రాయంలోనే దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల హక్కుల కోసం అల్లూరి చేసిన త్యాగం అనిర్వచనీయమన్నారు. ప్రజల కోసం ఆయన చేసిన విప్లవ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అల్లూరి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, స్వేచ్ఛాకాంక్ష గల ప్రతి భారతీయుడి గుండెల్లో కొలువై ఉన్న ఒక గొప్ప శక్తి అని అభివర్ణించారు. జయంతి వేడుకల్లో భాగంగా, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సమకూర్చిన అంబులెన్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ అధికారులకు అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.






