31 March, 2026 | 3:18 AM

నాసిరకం విత్త నాలకు చెక్!

31-03-2026 01:11 AM
  1. ‘తెలంగాణ సీడ్ బ్రాండ్’ పేర నాణ్యమైన విత్తనాలు
  2. నాబార్డు సాయంతో విత్తన సహకార సంఘాలు
  3. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు మూడు చొప్పున ఏర్పాటు
  4. రూ.1.93 కోట్ల నాబార్డు గ్రాంటు మంజూరు
  5. జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ కార్యాచరణ

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ర్టంలో విచ్చిలవిడిగా పుట్టుకొస్తున్న నకిలీ, నాసిరకం విత్తనాల దందాకు చెక్ పెట్టేందుకు సర్కార్ యోచిస్తోంది. మూల విత్తనాలను నాబార్డు సాయంతో విత్తన స హకార సంఘాలు ఏర్పాటుచేసి విత్తనోత్పత్తి చేయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి తెలం గాణ సీడ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు భావి స్తున్నారు.

నాణ్యత, అధిక ఉత్పాదకత దిగుబడుల సాధన లక్ష్యంతో దేశంలోనే మొట్ట మొదటిసారి విత్తన సహకార సంఘాలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంఘాలకు నాబార్డు ఆర్థికసాయం అందిస్తోంది. విత్తన సహకార సం ఘాల ఏర్పాటు ప్రాసెసింగ్ కోసం నాబార్డు రూ.1.93 కోట్ల గ్రాంటును మంజూరుచేసింది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 97 విత్తన సహకార సంఘాలు జిల్లాకు మూడు చొప్పున ఏర్పాటు చేయాలని వర్సిటీ నిర్ణయం తీసుకున్నది.

సంఘాల ద్వారా విత్తనోత్పత్తి చేయించడం, వాటికి బ్రాండింగ్ ఇచ్చి రైతులకు పంపిణీ చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలు భాగస్వాములుగా ఉంటాయి. దేశంలో విత్తనోత్సత్తికి తెలంగాణ కేంద్ర స్థా నంగా ఉన్నప్పటికీ అధికశాతం విత్తనోత్పత్తి సంస్థలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోనే ఉన్నా యి. ధర, నాణ్యత, దిగుబడుల విషయంలో రైతుల నుంచి ఏటా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

విత్తనాల మొలక శాతం తక్కువగా ఉండటం, కొన్నిచోట్ల మొలకెత్తకపోవడం, దిగుబడులు రాక పోవడం వంటి సమస్యలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. విత్తన చట్టంలోని లోసుగులతో రైతులకు తగిన నష్టపరిహారం దక్కడం లేదు. కంపెనీల సహకారంతో కొందరు రైతులు విత్తనాల ఉత్పత్తి చేపడుతున్నప్పటికీ వారికి ఆశించిన లాభాలు రావడం లేదు. ధాన్యం ఉత్పత్తిలోనే తెలంగాణ మొదటి వరుసలో ఉంటుంది. 

విత్తన వ్యవస్థపై వర్సిటీ అధ్యయనం

రాష్ర్టంలో విత్తన వ్యవస్థపై ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. విత్తన ఉత్పత్తి, పంపిణీ  వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా రైతులతోనే సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వ్యవసాయ వర్సిటీ నుం చి ప్రతిపాదనలు కోరింది. అనంతరం వర్శి టీ అధికారులు నాబార్డు సంస్థతో సంప్రదింపులు జరిపారు. వ్యవసాయరంగ ప్రోత్సాహ క నిధి కింద గ్రాంట్ ఇచ్చేందుకు నాబార్డు అంగీకారం తెలుపడంతో ఆ మేరకు విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.

ఒక్కో సంఘంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు సభ్యులుగా ఉంటా రు. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, ప్యాకేజింగ్, పంపిణీ వంటి అంశాలపై వారికి శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన రైతులకు వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన బ్రీడర్, ఫౌండేషన్ విత్తనాలను అందజేస్తారు. ఆ యా పంటల సాగుకు వర్సిటీ సాంకేతిక సా యం అందిస్తుంది. శాస్త్రవేత్తలు ఆయా విత్తన క్షేత్రాలను సందర్శించి పర్యవేక్షిస్తూ.. విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తా రు. అనంతరం నాబార్డు సాయంతో ఏర్పాటయ్యే యూనిట్లలో విత్తనశుద్ధి చేయిస్తారు.

ఏటా రూ.కోట్లు విలువైన నకిలీ విత్తనాల దందా.. 

రాష్ర్టంలో ఏటా కోట్ల రూపాయల విలువైన నాసిరకం విత్తనాల దందా సాగుతోంది. ఎక్కువగా వరి, పత్తి, మక్కజొన్న విత్తనాలు సీజన్‌కు రెండు నెలల ముందే గుట్టుగా కంపెనీలు దిగుమతిచేస్తాయి. మధ్య దళారులను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం అందించే విత్తనాల కంటే తక్కువకే ఇస్తామని రైతులను నమ్మించి కొనుగోలు చేసేలా మోసాలకు పాల్పడుతున్నాయి.

నకిలీ విత్తనాలపై రైతు సంఘాలు పోరుచేసినా ప్రభుత్వాలు వాటిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేశాయి. ఈ విషయాలు పరిగణలోకి తీసుకున్న వ్యవసాయ వర్సిటీ విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విత్తన సహకార సంఘాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంటే ప్రైవేట్ కంపెనీలు ఇచ్చే నకిలీ విత్తనాలకు చెక్ పడనున్నది.