31 March, 2026 | 1:52 AM

సింగరేణి ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తత

31-03-2026 12:06 AM
  1. పోలీసులు, సీపీఐ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
  2. నారాయణ, సాబీర్ పాషా, యూనియన్ నేతలు వాసిరెడ్డి, రాజ్‌కుమార్ అరెస్టు
  3. సింగరేణిని పాలకులు దోచుకుంటున్నారని ఫైర్
  4.   50వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్
  5. లేదంటే సమ్మె సైరన్ మోగిస్తామంటూ హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 30 (విజయక్రాంతి): సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ సోమవారం చేపట్టిన సింగరేణి హెచ్‌ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా  మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు.

పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్‌లను పోలీసులు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంతకుముందు నారాయణ మాట్లాడారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని, ఆ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త గనుల ప్రారంభంపై యాజమాన్యం చూపుతున్న నిర్లక్ష్యం సంస్థ మనుగడకే ముప్పు అని, ఏసీబీ విచారణ సాకుతో మెడికల్ బోర్డును నిలిపివేయడం కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు సింగరేణి సిరిని దోచుకుంటున్నాయని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబె ట్టుకోకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని గట్టి పోరాటాలు నిర్వహిస్తామని, అవసరమైతే సింగరేణి కార్యాలయాలను స్వాధీనం చేసుకొని తమ సత్తా చాటుతామని చెప్పారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, సొంత ఇంటి పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

క్లర్క్ పోస్టులకు కోర్టు కేసులతో సంబంధం లేకుండా పరీక్షలు జరపాలని, 350 మంది డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సహజ మరణం పొంది న కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు వల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ప్రకటించటం దుర్మార్గమన్నారు. కొత్త గనులు ఏర్పాటు చేసే క్రమంలో ప్రైవేటు పెత్తనానికి స్వస్తి చెప్పి  సింగరేణి కార్మికులతోనే బొగ్గు ఉత్పత్తిని చేయాలని, పాత పద్ధతిలోనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మికుల గొంతుకగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే సింగరేణి వ్యాప్తంగా సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, కె సారయ్య, వీరభద్రం, వైవి రావు, ముస్కె సమ్మయ్య, వంగ వెంకట్, జి వీరాస్వామి, ఎస్ వి రమణమూర్తి, వి మల్లికార్జున్ రావు, ఏఐటీ యూసీ జిల్లా కార్యదర్శి నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య పాల్గొన్నారు.