31 March, 2026 | 3:16 AM

ప్రియురాలిని ముక్కలుగా నరికి..

31-03-2026 01:41 AM
  1. రక్తపు వాసన రాకుండా సెంట్ కొట్టి..
  2. విశాఖ మౌనిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు

అమరావతి, మార్చి 30: విశాఖపట్టణంలోని ఎల్‌వీ నగర్ ప్రాంతంలో మౌనిక (29) హత్య కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లాక్‌డౌన్ సమయంలో ఇండియన్ నేవల్ షిప్ దేగాలో పనిచేస్తున్న నావికాదళ అధికారి చింతాడ రవీంద్రకు 2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనిక పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో రవీంద్ర, మౌనికకు సుమారు రూ.3.50 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించాడు.అయితే, తర్వాత డబ్బు కోసం మౌనిక తనను తరచూ ఒత్తిడి చేసేదని, ఆమె వేధింపులను తట్టుకోలేక చివరకు హత్యకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపాడు.ఆదివారం మధ్యాహ్నం రవీంద్ర ఎల్‌వీ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మౌనికను పిలిచాడు.

ఆమె అక్కడికి చేరుకున్న కొద్ది సేపటికే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ క్రమంగా హింసాత్మకంగా మారి,రవీంద్ర మౌనికను దారుణంగా హతమార్చాడు. ఇదిలా ఉండగా,హత్యకు ముందుగానే రవీంద్ర గాజువాకలో కత్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది.హత్య అనంతరం, రక్తపు మరకలను శుభ్రం చేయడంతో పాటు,వాసన రాకుండా ఇంట్లో సెంట్ ఉపయోగించాడు.

అనంతరం మౌనిక శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.తలతో పాటు ఆమె మొబైల్ ఫోన్‌ను దారపాలెం ప్రాంతంలోని తోటల్లో తగులబెట్టినట్లు సమాచారం.ఈ ఘటన తర్వాత రవీంద్ర తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించాడు. ఆ స్నేహితుడు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో, చివరకు రవీంద్ర గాజువాక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈకేసు ప్రస్తుతం విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.