31 March, 2026 | 3:07 AM

మండలిలోనూ మైనింగ్ రచ్చ!

31-03-2026 01:19 AM
  1. హౌస్ కమిటీకై పట్టు
  2. బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): మైనింగ్ వ్యవహారంపై శాసన మండలిలో రచ్చ జరిగింది. సోమవారం శాసనమండలి ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఛైర్మన్ పోడి యం దగ్గరికి దూసుకెళ్లారు. ‘అక్రమాల ఘనాపాటి మంత్రి పొంగులేటి’ అంటూ బీఆర్‌ఎస్ సభ్యులు ఫ్లకార్డులు పట్టుకొని.. ఇదేమీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.. దొంగ ల రాజ్యం.. దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు.

కాగితాలు, బడ్జెట్ ప్రతు లను చించి ఛైర్మన్ కుర్చీ వైపు విసిరారు. పోడియం వైపు దూసుకెళ్తున్న ఎమ్మెల్సీలను మార్షల్స్ పలుమార్లు అడ్డుకున్నా రు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే ఉద్యోగుల తల్లిదండ్రుల సంరక్షణ బిల్లును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శ్రీపాల్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, మల్క కొమురయ్య మద్దతు తెలుపగా ఈ బిల్లు ఆమోదం పొందింది. 

సీరియస్ అయిన ఛైర్మన్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్ ఏకంగా సభ్యులు కూర్చునే సీట్లపై ఎక్కి నిరసన తెలిపారు. సభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని పదే పదే ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. ఛైర్మన్ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో గెటవుట్ అంటూ పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై గుత్తా  సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీలాంటి వారు సభకు రావడం  సరికాదని, ఇది పెద్దల సభ అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సభ గౌరవం కాపాడాలన్నారు. గతంలో ఎన్నడూ మండలిలో సభ్యులను సస్పెండ్ చేయలేదని, ఆ పరిస్థితిని కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. 

అయినా.. చప్పట్లు కొడుతూ.. నినాదాలు చేస్తూ ఎంతసేపటికి బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో సభ్యుల తీరు సరైంది కాదని, వారిని సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా బీఆర్‌ఎస్ సభ్యులను సోమవారం సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు  చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. సస్పెండ్ చేసినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వెళ్లకపోవడంతో గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపించాలని, అక్కడి అధికారులను ఛైర్మన్ సూచించడంతో మార్షల్స్ వారిని ఎత్తుకెళ్లి బయటకు పంపించారు.

సస్పెండైన 11 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు..

శాసనమండలి నుంచి సోమవారం సస్పెండ్ అయిన వారిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పదకొండు మంది ఉన్నారు. వీరిలో మండలి బీఆర్‌ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, తాతా మధు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నవీన్‌కుమార్, వంటేర్ యాదవరెడ్డి, శంబీపూర్ రాజు, దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, కోటిరెడ్డి, వాణీదేవి ఉన్నారు.