31 March, 2026 | 2:38 AM

శాసనసభ, మండలి నిరవధిక వాయిదా

31-03-2026 12:50 AM
  1.   10 బిల్లులకు ఆమోదం.. ఒక బిల్లు సెలక్ట్ కమిటీకి సిఫార్సు
  2. ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం 
  3.   82.47 గంటలు జరిగిన శాసన సభ 
  4. సంక్షేమమే ధ్యేయం: డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): తెలంగాణ బడ్జెట్ సమాశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత 10 రోజులుగా వాడీవేడిగా సాగిన సభను శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. బడ్జెట్ వ్యయాలకు సంబంధించి అత్యంత కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ, మండలిలో  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

దీంతో ప్రభుత్వ పథకాల అమలుకు మార్గం సుగమమైంది. ఈ బడ్జెట్ సేషన్‌లో ప్రజా సమస్యలు, బడ్జెట్‌లో కేటాయింపులు, రాష్ట్ర భవిష్యత్తుపై అధికార, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ సెషనల్‌లో అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు సాగగా, 82 గంటల 47  నిమిషాలు పని చేసింది. సభ్యులు వివిధ ప్రజా సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన 11 ముఖ్యమైన బిల్లులకు గాను 10 బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది.

ఒక బిల్లును సెలక్ట్ కమిటీని సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లుతుందని చెప్పారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు విద్యా, వైద్యానికి పెద్ద పీట వేశామని వివరించారు. విబి రాంజీ పథకాన్ని ఎత్తివేయాలని గతంలో తీర్మానం చేశాం మరోసారి పార్టీలకు అతీతంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు.

ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తున్నామని,  ఒక్కో స్కూల్లో 1500 మంది విద్యార్థులు ఉంటారని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు టామ్ కామ్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు,  స్కిల్ యూనివర్సిటీ ఇతర దేశాల్లో ఉద్యోగానికి వెళ్లే పిల్లలకు ఆ దేశ భాషలు నేర్పించడం తమ ప్రభుత్వ కమిట్‌మెంట్ అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను .. ఒక్కో పాఠశాలను  రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. 

ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 100 కోట్లు,  చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 500 కోట్లు,  మిగిలిన యూనివర్సిటీలకు నిధులు కేటాయించామన్నారు. దేశ వృద్ది రేటు 8 శాతం ఉండగా తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటు 10.7 శాతం  ఉందని, 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికతో  ముందుకెళుతున్నామని భట్టి వివరించారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని, అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని వివరించారు.

దేవాలయాల అభివృద్ధి, మూసీ నది ఒడ్డున ఉన్న మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం చేపట్టామని, భద్రాచలం ఆలయ అభివృద్ధి పుష్కర ఘాట్ల నిర్మాణానికి రూ. 351 కోట్లు , గోదావరి పుష్కరాలకు రూ.  500 కోట్ల కేటాయించినట్లు చెప్పారు.

ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీ,  బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించలేదని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గత ఏడాది నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేశామని భట్టి వివరించారు. కల్తీ కల్లు నివారణకు చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.