31 March, 2026 | 3:17 AM

అన్నీ పేల్చేస్తాం!

31-03-2026 01:28 AM
  1. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ 
  2. డీల్‌ను తిరస్కరించినా, హోర్ముజ్‌ను తెరవకపోయినా సర్వనాశనమే 
  3. విద్యుత్ కేంద్రాలు, ఇంధన స్థావరాలు, ఖర్గ్ ద్వీపాన్ని భస్మంచేస్తాం
  4. ట్రూత్‌లో ట్రంప్ తాజా పోస్ట్ 
  5. పాక్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన ఇరాన్

వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్, మార్చి 30: ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి సాధించామని, కానీ ఏ కారణం చేత నైనా త్వరలో ఒప్పందం కుదరకపోయినా.. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోయి నా, ఇరాన్‌లోని అన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, ఇంధన బావులు, ఖర్గ్ ద్వీపాన్ని, డీశాలినేషన్ ప్లాంట్లను పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.

మరోవైపు యుద్ధం ముగించడానికి అమెరికాతో చర్చల విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఆ ఆతిథ్య వేదికలు వారి సొంతమని, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టంచేసింది. ఇంకోపక్క అమెరికాతో ప్రత్యక్ష చర్చ లు ఇప్పటివరకు జరగలేదని ముంబై ఇరాన్ కాన్సులేట్ వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కన్పించడం లేదు. ఇరాన్‌తో డీల్ క్యాన్సిల్ అయితే ఆ దేశ ఆర్థిక వనరులను అన్నింటినీ భస్మం చేస్తామని ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ మేరకు సోమవారం ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్‌తో తమ సైనిక కార్యకలాపాలను ముగించడానికి ఒక కొత్త, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో తీవ్రమైన చర్చలు జరుపుతున్నట్లు ఇందులో వెల్లడించారు. అయితే చర్చలు విఫలమై, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలను, ఇంధన బావులను, ఖర్గ్ ద్వీపాన్ని పేల్చివేస్తామని హెచ్చరించారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం ప్రారంభించిన అమెరికాకు ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ 48 గంటల్లో సీజ్ ఫైర్ ఒప్పందానికి రాకపోతే విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చిన ట్రంప్ వెనక్కి తగ్గారు. ముందు ఐదు రోజులు సమయం ఇచ్చానని చెప్పిన ట్రంప్.. ఆ తర్వాత దాన్ని మరో పది రోజులకు పొడిగించారు. అయినా ఇరాన్ లొంగకపోవడంతో సోమవారం మరింత ఘాటు హెచ్చరికలు చేశారు.

ఇరాన్‌లో 47 సంవత్సరాల భయానక పాలనలో తమ సైనికుల మరణానికి ప్రతీకార చర్యగా ఇది ఉంటుందన్నారు. ఇరాన్‌తో చాలా కాలంగా కోరుకుంటున్న అనేక లక్ష్యాలను అమెరికా సైన్యం ఛేదించిందని తెలిపారు. యుద్ధం ముగించే లక్ష్యంతో తాము విధించిన షరతులకు ఇరాన్ స్థూలంగా అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధానికి నెల రోజులు పూర్తయ్యింది.

రోజు రోజుకూ తీవ్రమవుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్, ఈజిప్టు, టర్కీ, సౌదీలు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చాయి. ఈ చర్చలకు పాక్ ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. దీంతో ఈజిప్ట్, టర్కీ, సౌదీ విదేశాంగ మంత్రులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై ఇరాన్ స్పందిస్తూ.. పాక్ వేదికలు వారి సొంతమని, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణలను ముగించేలా, ఆ రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రకటనపై ఇరాన్ స్పందిస్తూ.. పాక్ నేతృత్వంలోని ఇటువంటి ప్రయత్నాలలో తమ ప్రమేయం ఏమీ లేదని ఖండించింది. అమెరికాతో ఎటువంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే చేసిందని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోమవారం స్పష్టం చేసింది.

పాక్ వేదికలు వారి సొంత వ్యవహారమని, వాటిలో ఇరాన్ పాల్గొనలేదని కాన్సులేట్ తేల్చిచెప్పింది. ‘అమెరికాతో ప్రత్యక్ష చర్చలు లేవు.. కేవలం మధ్యవర్తుల ద్వారా అపరిమితమైర, అసమంజసమైన డిమాండ్లు మాత్రమే చేసింది. అమెరికా ‘దౌత్యం’ నిరంతరం మారుతూ ఉంటుంది.. మా వైఖరి మాత్రం స్పష్టం. పాకిస్థాన్ వేదికలు వారి సొంతం.. అందులో మేము పాల్గొనబోం.. యుద్ధాన్ని ముగించాలన్న ప్రాంతీయ దేశాధినేతల పిలుపులను స్వాగతిస్తున్నాం.

కానీ దాన్ని ఎవరు ప్రారంభించారో గుర్తుంచుకోండి!’ అని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇస్లామాబాద్‌లో ఆదివారం జరిగిన చర్చలు కట్టుదిట్టమైన భద్రత నడుమ, అమెరికా, ఇజ్రాయెల్ లేదా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రాతినిథ్యం లేకుండా జరిగాయి.

వాషింగ్టన్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరిపినట్లు అంగీకరించడానికి టెహ్రాన్ నిరాకరించింది. కానీ ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళికకు ఇస్లామాబాద్ ద్వారా స్పందన పంపినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. మరోవైపు, చర్చలు జరుగుతున్నాయంటూనే.. ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా భీకరదాడులు కొనసాగిస్తున్నాయి. అటు, ఇరాన్ కూడా ధీటుగా ప్రతీకార దాడులు చేస్తోంది.