18 July, 2026 | 12:40 AM

క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి

18-07-2026 12:28 AM

డీఎంహెచ్‌ఓ ధనరాజ్ 

కొండపాక, జులై 17: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు, వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన చికిత్స, పోషకాహారం అందించాలని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిహెచ్ ధనరాజ్ అన్నారు. టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి బాధితులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేసి మాట్లాడారు.

పోషక విలువలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి, బరువు పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు సూచించే సూచనలు సలహాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, ఫార్మసీలో మందుల నిల్వలు, నాణ్యతను తనిఖీ చేసి, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలన్నారు. జ్వరంతో వచ్చే ప్రతి బాధితునికి అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి సకాలంలో చికిత్స అందించాలని ఆదేశించారు.

కచ్చితంగా సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలలో టీబి లక్షణాలను గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స ప్రారంభించి కుటుంబ సభ్యులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా పరిశీలించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీబీ పై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ నిర్మల రెడ్డి(టీబీ ), డాక్టర్ వినోద్, కొండపాక మండల వైద్య అధికారి డాక్టర్ శ్రీధర్, హెచ్ ఈవో సత్యనారాయణ, ఏఎన్‌ఎం లు పాల్గొన్నారు.