18 July, 2026 | 12:48 AM

టీజీ20 లీగ్ ఆడిట్ లెక్కలు ఎక్కడ?: టీసీఏ

18-07-2026 12:37 AM

వెంటనే వెబ్‌సైట్‌లో ఉంచాలని డిమాండ్

టీసీఏ ప్రశ్నలకు సమాధానాలేవి ?

హెచ్‌సీఏ తీరుపై గురువారెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, జూలై 17: తెలంగాణ టీ20 లీగ్‌కు సంబంధించి ఆడిట్ ఖాతాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రజల ముం దుంచాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బీసీసీఐ రాజ్యాంగంలోని రూల్ 37(2) ప్రకారం టీజీ20 లీగ్‌కు సంబంధించిన ఆర్థిక నివేదికలు, పరిపాలనా రికార్డులను వెంటనే హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మేరకు హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సింగిల్ మెంబర్ కమిటీ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) పి. నవీన్ రావుకు అధికారిక వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. దాని ప్రతులను హెచ్‌సీఏ కార్యదర్శి, తాత్కాలిక అధ్యక్షుడు, తాత్కాలిక సీ ఈఓ, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, ప్లేయర్స్ ప్రతినిధులు తదితరులకు పంపినట్లు వెల్లడించారు.

ధరం గురువారెడ్డి మాట్లాడుతూ, రూల్ 37(2) ప్రకారం ప్రతి క్రికెట్ సంఘం తన ఆడిట్ చేసిన ఆర్థిక లెక్కలు, వార్షిక నివేదికలు, కీలక పరిపాలనా పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం తప్పనిసరి అని గుర్తు చేశారు. అలాగే, టీసీఏ గతంలో లేవనెత్తిన ప్రశ్నలకు హెచ్‌సీఏ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు.

హెచ్ సీఏ స్వయంగా చేసిన ప్రకటనల ప్రకారం టీజీ20 లీగ్ ఇప్పటికే కోట్ల రూపాయల నష్టాల్లో నడుస్తున్నప్పటికీ, ఆర్థిక లావాదేవీ ల వివరాలను ప్రజలకు వెల్లడించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఐడీ, అవినీతి నిరోధక శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టరేట్ వంటి సంస్థలు హెచ్‌సీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో టీజీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి ఆర్థిక పారదర్శకత మరింత అవసరమన్నారు.