భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి
గీతం సదస్సులో అభిప్రాయపడ్డ సైకాలజీ నిపుణులు
పటాన్ చెరు: మానసిక పరిశోధన యొక్క విస్తరిస్తున్న పరిధిని, సంక్లిష్టమైన మానవ, సామాజిక సవాళ్లను అంతర్-విభాగ దృక్కోణాల ద్వారా పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని మానసిక శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ‘అనిశ్చితి కాలంలో మనస్తత్వ శాస్త్రం: అంతర్-విషయ దృక్పథం, ఆవిష్కరణ, ప్రభావం’ అనే అంశంపై రెండు రోజుల సదస్సును 17-18 తేదీలలో నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లైడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు హైబ్రిడ్ పద్ధతిలో జరిగింది. ఇందులో మనస్తత్వశాస్త్రం, దాని అనుబంధ విభాగాలకు చెందిన పరిశోధకులు, విద్యావేత్తలు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనిశ్చితి అనేది వ్యక్తిగత జీవితాలు, కార్యాలయాలు, విద్య, ఆరోగ్యం, సాంకేతికత, సమాజాన్ని అంతకంతకూ ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, వేగంగా మారుతున్న ఈ వాస్తవాలను మనస్తత్వ శాస్త్రం ఎలా స్పందించగలదో పరిశీలించడానికి సైకాన్ ’26 ప్రయత్నించింది. ఈ సదస్సు సమకాలీన మనస్తత్వ శాస్త్ర పరిశోధన, బోధన, ఆచరణపై విభిన్న దృక్కోణాలను ఒకచోట చేర్చి, అంతర్-విభాగ సంభాషణకు ఒక వేదికను కల్పించింది.
ఈ సదస్సులో క్లినికల్ సైకాలజీ, సైకోఅనాలిసిస్, సైకోఅనలిటిక్ సైకోథెరపీ, ఆర్గనైజేషనల్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, లీగల్-ఫోరెన్సిక్ సైకాలజీ, కాగ్నిటివ్-ఎక్స్ పెరిమెంటల్ సైకాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, టెక్నాలజీ-ఏఐ వంటి అనేక రంగాలకు సంబంధించిన పరిశోధన పత్రాలను సమర్పించారు.
బెర్లిన్ లోని మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్ మెంటుకు చెందిన సెంటర్ ఫర్ అడాప్టివ్ బిహేవియర్ అండ్ కాగ్నిషన్ (ఏబీసీ) డైరెక్టర్ డాక్టర్ గెర్డ్ గిగెరెంజర్ కీలకోపన్యాసం చేశారు. ఆయన భాగస్వామ్యం ఈ సదస్సుకు ఒక అంతర్జాతీయ దృక్కోణాన్ని తీసుకొచ్చింది. అనిశ్చిత వాతావరణంలో మనస్తత్వ శాస్త్రం, నిర్ణయాలు తీసుకోవడం, మానవ ప్రవర్తనపై చర్చలకు నాంది పలికింది.
ఈ సదస్సులో మనస్తత్వ శాస్త్రం, దాని అనుబంధ రంగాలలోని విభిన్న విభాగాలకు చెందిన ప్రముఖ వక్తలు కూడా పాల్గొన్నారు. వారిలో కోల్ కతాలోని ప్రదీప్ సెంటర్ ఫర్ ఆటిజం మేనేజ్ మెంట్ డైరెక్టర్, సైకాలజిస్ట్ డాక్టర్ మల్లికా బెనర్జీ; కలకత్త విశ్వవిద్యాలయం, సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనిందితా చౌధురి; ముంబై విశ్వవిద్యాలయం, అనువర్తిత మనస్తత్వశాస్త్ర విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వివేక్ బెల్హేకర్; క్లినికల్ సైకాలజిస్ట్, ఇన్నర్ హొరైజన్స్ వ్యవస్థాపకురాలు సుజాత అమేయ తదితరులు మనస్తత్వ శాస్త్రంలోని సమకాలీన ప్రశ్నలతో మమేకమయ్యేలా పండితోపన్యాసాలు, చర్చల ద్వారా ఇందులో పాల్గొన్న వారికి తోడ్పడ్డారు.
సైకాన్ ’26 విద్యార్థులకు, పరిశోధకులకు వారి పరిశోధనలను ప్రదర్శించడానికి, సుప్రసిద్ధ పండితులు, నిపుణులతో సంభాషించడానికి, సాంప్రదాయ విజ్జాన శాస్త్ర పరిధులను దాటిన దృక్కోణాలతో మమేకమవ్వడానికి అవకాశాలను కల్పించింది. విద్యా, వృత్తి, సాంకేతిక, సామాజిక సందర్భాలలో తలెత్తుతున్న సవాళ్లు, ఆవిష్కరణలో మానసిక శాస్త్ర పరిజ్జానాన్ని అనుసంధానించడం ప్రాముఖ్యతను ఈ సదస్సు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అప్లైడ్ సైకాలజీ విభాగ అధ్యాపకుల సహకారంతో డాక్టర్ రానితా బసు, డాక్టర్ శ్రీస్నిగ్ధ దిట్టకవి ఈ సదస్సును నిర్వహించారు. వారి సమిష్టి కృషి సైకాన్ ’26 విజయవంతమైన నిర్వహణకు, ఈ విజ్జాన శాస్త్రంలో అర్థవంతమైన, విద్యాపరమైన చర్చలకు ఒక వేదికను అందించింది.






