18 August, 2026 | 6:25 PM

జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శించిన మంత్రి వివేక్

18-08-2026 05:34 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం, పోస్ట్‌ ఆఫీస్ సెంటర్‌ నందు గ్రంథాలయమును కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.

గ్రంథాలయంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా సౌకర్యాలు కల్పించడంతో పాటు, గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు  పనితీరును మంత్రి అభినందించారు. పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఇన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రంథాలయాలు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శక కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు. మంత్రి గ్రంథాలయాన్ని సందర్శించిన సందర్భంగా గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.